రేపు రెజ్లర్లకు మద్దతుగా యూపీలో రైతు నాయకుల సమావేశం
భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్‌పై చర్యలు తీసుకోవాలని అగ్రశ్రేణి రెజ్లర్లు చేస్తున్న నిరసనలకు మద్దతుగా రైతు నాయకులు గురువారం భారీ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశంలోనే భవిష్యత్ కార్యచరణను ప్రకటించే అవకాశం ఉంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలోని సౌరం పట్టణంలో సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) నాయకుడు నరేష్ టికాయిత్ సహా ఇతర కాప్ నాయకులు సమావేశంలో పాల్గొనున్నారు.
వివిధ రాష్ట్రాల నుంచి రైతు నాయకుల హాజరు
ఈ ఏడాది జనవరిలో దిల్లీలో తమ నిరసనను ప్రారంభించిన రెజ్లర్లు, మహిళా అథ్లెట్లను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ సింగ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే, మంగళవారం ఒలింపిక్ పతక విజేతలైన సాక్షి మాలిక్, బజరంగ్ పునియా, ఆసియా క్రీడల ఛాంపియన్ వినేష్ ఫోగట్‌లతో సహా అగ్రశ్రేణి రెజ్లర్లు హరిద్వార్‌లోని గంగానదిలో పతకాలను నిమజ్జనం చేయాలని నిర్ణయించారు. రైతు నాయకుడు రాకేశ్ టికాయిత్ జోక్యం చేసుకొని, 5రోజుల డెడ్‌లైన్ విధిస్తూ, పతకాల నిమజ్జాన్ని ఆపాలాని రెజ్లర్లను కోరారు. ఈ క్రమంలోనే కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు యూపీలో సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ మహాపంచాయత్‌కు ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, దిల్లీ నుంచి వివిధ ఖాప్‌ల ప్రతినిధులు హాజరుకానున్నారు.