India-Canada: కెనడా ప్రధాని ట్రూడో వ్యాఖ్యలకు భారత్ గట్టి కౌంటర్
భారత్‌తో ఉన్న దౌత్య విభేదాలు భగ్గుమన్న వేళా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau) చేసిన తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఖలిస్థానీ అనుకూలవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ (Nijjar Murder Case) హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్ల పాత్ర ఉందని ట్రూడో గతంలో ఆరోపణలు చేసినప్పుడు, తమ వద్ద ఉన్న నిఘా సమాచారం మాత్రమే ఉందని, కానీ పక్కా ఆధారాలు లేవని చెప్పారు. ఈ నేపథ్యంలో, భారత విదేశాంగ శాఖ (MEA) కెనడాకు గట్టి కౌంటర్ ఇచ్చింది, ట్రూడో తీరుపై తీవ్రమైన విమర్శలు చేసింది.
కెనడా తమ ఆరోపణలకు మద్దతుగా ఎలాంటి ఆధారాలు ఇవ్వలేదు: జైశ్వాల్
భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ మాట్లాడుతూ, ''నిజ్జర్ హత్య కేసుకు సంబంధించి మేము ఎన్నో రోజులుగా చెబుతున్నదే రుజువైంది. కెనడా తమ ఆరోపణలకు మద్దతుగా ఎలాంటి ఆధారాలు ఇవ్వలేదు. ఇరు దేశాల మధ్య సంబంధాలు ఈ స్థాయిలో దిగజారడానికి కెనడా ప్రధాని ట్రూడోనే పూర్తిగా బాధ్యుడు'' అని పేర్కొన్నారు.