LOADING...
Meerut Doctor: డాక్టర్‌ ఘనకార్యం.. బాలుడికి గాయమైన చోట ఫెవిక్విక్‌ రాసి.. 
డాక్టర్‌ ఘనకార్యం.. బాలుడికి గాయమైన చోట ఫెవిక్విక్‌ రాసి..

Meerut Doctor: డాక్టర్‌ ఘనకార్యం.. బాలుడికి గాయమైన చోట ఫెవిక్విక్‌ రాసి.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 20, 2025
03:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో ఓ చిన్నారిపై వైద్యుడు నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఘటన కలకలం రేపుతోంది. గాయాలతో ఆసుపత్రికి తీసుకెళ్లిన బాలుడికి కుట్లు వేయాల్సిన పరిస్థితిలో డాక్టర్ దానికి బదులుగా ఫెవిక్విక్‌ పూసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మేరఠ్‌లోని జాగృతి విహార్ కాలనీలో సర్దార్ జస్పీందర్ సింగ్ కుటుంబం నివసిస్తోంది. వారి కుమారుడు ఇంటి వద్ద ఆడుకుంటూ గాయపడ్డాడు. తలకు దెబ్బతగిలింది. వెంటనే అతడిని సమీపంలోని ఒక ప్రైవేట్‌ ఆసుపత్రికి తల్లిదండ్రులు తీసుకెళ్లారు. అక్కడ డ్యూటీ డాక్టర్ పక్కనే ఉన్న ఐదు రూపాయల ఫెవిక్విక్‌ తీసుకుని, కుట్లు వేయకుండా నేరుగా గాయంపై రాశాడు.

వివరాలు 

 ఫెవిక్విక్‌ను తొలగించడానికి మూడు గంటలు

దీనివల్ల చిన్నారి నొప్పితో తీవ్రంగా బాధపడినట్లు కుటుంబ సభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ''అబ్బాయి భయపడుతున్నాడు. కొద్దిసేపట్లో నొప్పి తగ్గిపోతుంది'' అని తమకు చెప్పాడని డాక్టర్ నిర్వాకం గురించి సింగ్ దంపతులు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే రాత్రంతా గడిచినా నొప్పి తగ్గకపోవడంతో, తల్లిదండ్రులు మరో ఆసుపత్రి సహాయం కోరారు. అప్పటికే గాయానికి గట్టిగా అంటుకుపోయిన ఫెవిక్విక్‌ను తొలగించడానికి అక్కడి వైద్యులు దాదాపు మూడు గంటలు శ్రమించాల్సి వచ్చిందని తెలుస్తోంది. తర్వాతే బాలుడి గాయానికి అవసరమైన కుట్లు వేశారు.

వివరాలు 

ఘటన గురించి మీడియాకు  వివరించిన మేరఠ్ ప్రధాన వైద్యాధికారి

ఒకవేళ ఫెవిక్విక్‌ కంట్లోకి జారి ఉంటే పరిస్థితి ప్రమాదకరంగా మారేదని కుటుంబం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటన తమ దృష్టికి వచ్చిందని మేరఠ్ ప్రధాన వైద్యాధికారి డాక్టర్ అశోక్‌ కఠారియా మీడియాతో చెప్పారు. విచారణలో బయటపడే అంశాల ఆధారంగా సంబంధితులపై తగిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.