కమిషనర్ కుక్క కోసం ఇంటింటిని జల్లెడపడుతున్న పోలీసులు
ఈ వార్తాకథనం ఏంటి
ఆ సిటీ మున్సిపల్ కార్పోరేషన్ కే ఆమె బాస్. సహజంగా జంతు ప్రేమికురాలు అయిన ఆవిడ ప్రేమతో ఓ కుక్కను కుటుంబ సభ్యురాలిగా పెంచుకుంటున్నారు.
పైగా అలాంటి శునకాలు సిటీలోనే కేవలం 18 మాత్రమే ఉన్నాయని సమాచారం.
సదరు పప్పీ ఆదివారం సాయంత్రం నుంచి మిస్ అయ్యింది. ఈ విషయాన్ని మున్సిపల్ సిబ్బందితో పాటు పోలీసులకు తెలియజేయగానే గాలింపులు మొదలుపెట్టారు.
తిండి తిప్పలు లేకుండా, పనులన్నీ ఆపేసి ఏకంగా ఒక కుక్క జాడ కోసం 36 గంటల పాటు తీవ్రంగా శ్రమించారు. ఈ క్రమంలో నగరంలోని 500 ఇళ్లల్లో అధికార యంత్రాంగం గాలింపులు చేపట్టింది.
ఈ ఘటన ఉత్తర్ప్రదేశ్ లోని మీరట్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో జరిగింది.
DETAILS
అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న పెంపుడు శునకం జాడ ఇంకా దొరకలేదు
మీరట్ మున్సిపల్ కమిషనర్ సెల్వకుమారి జర్మన్ షెపర్డ్ శునకాన్ని ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. అయితే ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి సదరు పప్పీ కనిపించట్లేదు.
ఈ క్రమంలోనే పశుసంవర్థక శాఖలో పనిచేస్తున్న డాక్టర్ హర్పాల్ సింగ్ అదే రోజు అర్థరాత్రి కమిషనర్ ఇంటికి చేరుకున్నారు. అనంతరం శునకం పేరు, ఫొటో తదితర వివరాలను సేకరించి స్వయంగా గాలిస్తున్నారు.
మరోవైపు కుక్కను ఎవరైనా దొంగలించారేమోనని సీసీటీవీ ఫుటేజీలనూ పరిశీలించారు. అయినా సిటీ బాస్ పెంపుడు శునకం జాడని మాత్రం కనిపెట్టలేకపోయారు.
కమిషనర్ బంగ్లాలో విధులు నిర్వహించే సిబ్బంది సహా పోలీసులూ కుక్క కోసం అణువణువు గాలిస్తున్నారు.