తెలంగాణ: బీసీలకు రూ.లక్ష ఆర్థిక సాయం రూల్స్ ఇవే..ఈనెల 20న దరఖాస్తుకు లాస్ట్ డేట్
బీసీ ఫెడరేషన్ పరిధిలోని కులాలకు, చేతి వృత్తిదారులకు తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్ అందించింది. ఒక్కో చేతి వృత్తిదారుడికి రూ. లక్ష ఆర్థిక సాయం ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ మంగళవారం నుంచే ప్రారంభమైంది. అయితే దరఖాస్తుల ప్రక్రియకు తుది గడువుగా ఈనెల 20గా వెల్లడించింది. వెబ్ సైట్ https://tsobmmsbc.cgg.gov.in ద్వారా దరఖాస్తుల స్వీకరణ చేస్తున్నట్లు, అందులో లబ్ధిదారులు పూర్తి వివరాలు సమర్పించి అప్లై చేసుకోవాలని సూచించారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ప్రభుత్వం ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. లబ్ధిదారుల వృత్తి పనిముట్లు, ముడిసరుకు కొనుగోలులో ఈ నిధులు వృత్తిదారులను ఆదుకుంటాయని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల అన్నారు.
ఈ పథకం కుటుంబంలో ఒక్కరికి మాత్రమే వర్తిస్తుంది
లబ్ధిదారులకు మార్గదర్శకాలు రిలీజ్ : 1. బీసీ కులవృత్తిదారులు, చేతివృత్తిదారులై ఉండాలి. 2. వయసు జూన్ 2 నాటికి 18 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి 3. వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ. 1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ. 2 లక్షలకు మించరాదు 4. పనిముట్లు, ముడిసరుకు కొనుగోలుకు మాత్రమే నిధులిస్తారు. 5. కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేస్తారు 6. గడిచిన 5 ఏళ్లలో ఏ ప్రభుత్వ శాఖ ద్వారా ఆర్థిక సాయం పొంది ఉండకూడదు. 7. 2017-18లో రూ. 50 వేల ఆర్థికసాయం పొందినవారూ దీనికి అనర్హులు. 8. వెబ్ సైట్ https://tsobmmsbc.cgg.gov.in ద్వారా ఫారం నింపాలి
అర్హుల జాబితాలో ఆన్ లైన్ లో విడుదల
9. కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం, రేషన్ కార్డు , ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్ బుక్, పాస్ పోర్ట్ సైజ్ ఫోటోను సమర్పించాలి. 10. మండల స్థాయిలో ఎంపీడీఓలు, పురపాలికల్లో పుర కమిషనర్లు దరఖాస్తుదారుల వివరాలను పరిశీలిస్తారు. 11. అర్హుల జాబితాలో ఆన్ లైన్ లో విడుదల చేస్తారు. 12. ఎంపికైన వారి బ్యాంకు అకౌంట్ లో డబ్బు జమ చేస్తారు. అయితే బ్యాంకులో డబ్బులు జమ అయిన నెల రోజుల్లోగా సదరు లబ్ధిదారుడు కావాల్సిన పనిముట్లు, ముడిసరుకును కొనుగోలు చేయాలి. బీసీ కులాల్లో దాదాపు 130కిపైగా కులాలుండగా, తెలంగాణ ప్రభుత్వం 6 కులాలకు వివిధ ఫెడరేషన్ల ద్వారా రూ. లక్ష ఆర్థికసాయం ఇవ్వనుంది.