Rahul Gandhi: విద్యార్థుల ఆందోళనల వేళ సీఎం సోరెన్‌కు రాహుల్ గాంధీ లేఖ
ఈ వార్తాకథనం ఏంటి
జార్ఖండ్‌లో విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు లేఖ రాశారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులను సీఎం స్వయంగా కలిసి మాట్లాడాలని ఆయన సూచించారు. ప్రశ్నాపత్రాల లీకేజీలు, నియామక పరీక్షల్లో అక్రమాలు, విద్యా వ్యవస్థలోని లోపాలకు వ్యతిరేకంగా విద్యార్థులు చేస్తున్న పోరాటానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని లేఖలో స్పష్టం చేశారు. దీంతో రాహుల్ రాసిన లేఖపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.
వివరాలు
విద్యార్థుల డిమాండ్లు న్యాయమైనవే..
రాజ్యాంగం కల్పించిన శాంతియుత నిరసన హక్కు ప్రజాస్వామ్యానికి ఎంతో కీలకమని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
జార్ఖండ్‌లో రాష్ట్ర రిక్రూట్‌మెంట్ పరీక్షల్లో అక్రమాలకు వ్యతిరేకంగా విద్యార్థులు చేపడుతున్న ఆందోళనలు, వారు చేస్తున్న డిమాండ్లు న్యాయమైనవేనని తెలిపారు.
విద్యార్థులతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేయడం, వారి డిమాండ్లలో కొన్నింటిని అంగీకరించడం అభినందనీయమని రాహుల్ పేర్కొన్నారు.
అయితే, కొందరు విద్యార్థులు ఇప్పటికీ ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్న విషయాన్ని సీఎం హేమంత్ సోరెన్ దృష్టికి తీసుకెళ్లారు.
వివరాలు
విద్యా వ్యవస్థపై బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌పై విమర్శలు
భారతీయ విద్యా వ్యవస్థను బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ తమ ఆధీనంలోకి తీసుకున్నాయని రాహుల్ గాంధీ ఆరోపించారు.
విద్యార్థుల శ్రమను దోచుకునే సాధనంగా విద్యా వ్యవస్థను మార్చారని విమర్శించారు.
విద్యార్థుల సమస్యలను పరిష్కరించే విషయంలో ప్రభుత్వం మరింత సున్నితంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
ఆందోళన చేస్తున్న విద్యార్థులను సీఎం హేమంత్ సోరెన్ స్వయంగా కలిసి వారి సమస్యలను తెలుసుకోవాలని రాహుల్ కోరారు.
విద్యార్థుల డిమాండ్ల పరిష్కారానికి సీఎం చొరవ చూపాలని సూచించారు.