Supreme Court: సీఎంను కలుసుకోండి.. తమిళనాడు గవర్నర్‌కు 'సుప్రీం' సూచన
ఈ వార్తాకథనం ఏంటి
తమిళనాడు ప్రభుత్వం, గవర్నర్ ఆర్ఎన్ రవి(RN Ravi)కి మధ్య నెలకొన్న వివాదం రోజు రోజుకు ముదురుతోంది.
అసెంబ్లీ తీర్మానించిన బిల్లులను గవర్నర్ ఆమోదించడంలో జాప్యం చేస్తున్నారని స్టాలిన్ ప్రభుత్వం గత కొంతకాలంగా ఆరోపిస్తోంది.
తాజాగా తమిళనాడు బిల్లుల ఆమోదంలో జాప్యంపై నెలకొన్న ప్రతిష్టంభనను సీఎం స్టాలిన్‌తో సమావేశమై పరిష్కరించుకోవాలని తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు(Supreme Court) శుక్రవారం విచారణ చేసింది.
బిల్లుల విషయంలో నెలకొన్న ప్రతిష్టంభనను గవర్నర్ పరిష్కరించాలని కోరుతున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది.
Details
డిసెంబర్ 11కు విచారణ వాయిదా
అసెంబ్లీ తిరిగి ఆమోదించిన 10 బిల్లులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు గవర్నర్ రిఫర్ చేశారని రాష్ట్ర ప్రభుత్వం తరుఫు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ అత్యున్నత న్యాయస్థానికి తెలియజేశారు.
ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలను చేసింది.
అసెంబ్లీ తిరిగి ఆమోదించిన బిల్లులు రాష్ట్రపతికి రిజర్వ్ చేయకూడదన్న విషయాన్ని గవర్నర్ గమనించాలని జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.
ఈ అంశంపై తదుపరి విచారణను డిసెంబర్ 11కు వాయిదా వేసింది.