Mega DSC : తెలంగాణలో మరో 6వేల పోస్టులతో మెగా డీఎస్సీ.. భట్టి విక్రమార్క
తెలంగాణ డిప్యూటీ సీఎం, మంత్రి మల్లు భట్టి విక్రమార్క నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. రాబోయే కాలంలో 6,000 పోస్టులతో మరొక మెగా డీఎస్‌సీని ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు. ఈ రోజు ఆయన రాష్ట్రవ్యాప్తంగా హాస్టల్ తనిఖీ కార్యక్రమంలో భాగంగా ఖమ్మం, మధిర, బోనకల్ సంక్షేమ పాఠశాలలు, గురుకుల పాఠశాలలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత 10 సంవత్సరాలుగా మెస్, 16 సంవత్సరాలుగా కాస్మోటిక్స్ ఛార్జీలలో ఎలాంటి పెరుగుదల జరగకపోవడంతో విద్యార్థులు సమస్యలు ఎదుర్కొన్నారని తెలిపారు.
డైట్ ఛార్జీలను 40 శాతం పెంచాం
విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, పెరిగిన ధరల అనుసారంగా డైట్ ఛార్జీలను 40 శాతం పెంచామన్నారు. కాస్మోటిక్ ఛార్జీలను 200 శాతం పెంచామని వెల్లడించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, త్వరలోనే 6,000 పోస్టులతో కొత్త మెగా డీఎస్‌సీ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు.