Page Loader
Siddaramaiah: కన్నడ అనువాద తప్పులపై సిద్ధరామయ్య ఫైర్.. క్షమాపణలు చెప్పిన మెటా
కన్నడ అనువాద తప్పులపై సిద్ధరామయ్య ఫైర్.. క్షమాపణలు చెప్పిన మెటా

Siddaramaiah: కన్నడ అనువాద తప్పులపై సిద్ధరామయ్య ఫైర్.. క్షమాపణలు చెప్పిన మెటా

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 18, 2025
09:30 am

ఈ వార్తాకథనం ఏంటి

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకి మెటా సంస్థ క్షమాపణలు తెలిపింది. ఇటీవల ఓ పోస్టును కన్నడ నుండి ఆంగ్లంలోకి తప్పుగా అనువదించడంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా మెటా సంస్థ స్పందించింది. కన్నడ నుండి ఆంగ్ల అనువాదంలో ఏర్పడిన లోపాన్ని పరిష్కరించినట్టు మెటా ప్రతినిధులు ప్రకటించారు. ఇలాంటి తప్పిదం జరగడంతో ఖేదం వ్యక్తం చేస్తూ క్షమాపణలు కోరినట్లు చెప్పారు. ఆ తప్పిదానికి కారణం ఏఐ టూల్ మిషన్‌లో ఏర్పడిన లోపమేనని, ఇది తమ సాంకేతిక లోపం వల్ల జరిగినదని కంపెనీ ఫేస్‌బుక్‌లో స్పష్టం చేసింది. ఇకపై మరింత ఖచ్చితమైన అనువాదాన్ని అందించేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చింది. తమ సాంకేతికతను మెరుగుపర్చేందుకు వినియోగదారుల అభిప్రాయాలను సేకరిస్తున్నామని కూడా వివరించింది.

వివరాలు 

అసలు ఏం జరిగిందంటే..

ఇటీవల ప్రముఖ సీనియర్ నటి బి. సరోజాదేవి మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఆమె మరణంపై సంతాపం తెలుపుతూ కర్ణాటక సీఎం కార్యాలయం కన్నడలో ఒక పోస్టు విడుదల చేసింది. అందులో బహుభాషా నటి, సీనియర్ నటిగా పేరుగాంచిన బి. సరోజాదేవి పార్ధివదేహానికి సీఎం సిద్ధరామయ్య నివాళులు అర్పించినట్టు పేర్కొన్నారు. అయితే, ఆ పోస్టును మెటా సంస్థ ఆంగ్లంలోకి తప్పుగా అనువదించింది. ఈ విషయంపై సీఎం సిద్ధరామయ్య తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ సంస్థపై మండిపడి, ఇకపై కన్నడ నుండి ఆంగ్లంలోకి అనువాదాన్ని నిలిపేయాలని సూచించారు. తప్పుదోవ పట్టించే ఈ రకమైన తప్పులు వాస్తవాలను వక్రీకరించి వినియోగదారులను దారి తప్పించనున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

వివరాలు 

సోషల్ మీడియాలో బాధ్యతాయుతమైన విధానాన్ని అవలంబించాలి 

ఇలాంటి పొరపాట్లు చాలా ప్రమాదకరమని అన్నారు. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న సీఎం మీడియా సలహాదారు కేవీ ప్రభాకర్‌ ద్వారా మెటా సంస్థకు అధికారికంగా లేఖ రాయించి, తప్పును సవరించాలని కోరినట్టు తెలిపారు. సోషల్ మీడియాలో బాధ్యతాయుతమైన విధానాన్ని అవలంబించాలని మెటాకు సూచించారు. టెక్ దిగ్గజాల నిర్లక్ష్య చర్యల వల్ల ప్రజల్లో విశ్వాసం కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ అంశంపైనే తాజాగా మెటా స్పందించిందని తెలుస్తోంది.