
TG Rains: హైదరాబాద్'కి నేడు ఆరెంజ్ అలెర్ట్ జారీ
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ వ్యాప్తంగా అల్పపీడన ప్రభావం కొనసాగుతుండటంతో విస్తారమైన వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రం మొత్తం తడిసి ముద్దైంది. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగిపోయాయి. దాంతో సాధారణ జనజీవనం తీవ్రంగా అంతరాయం కలిగింది. హైదరాబాద్‌లో రాత్రి నుంచే వర్షం పడుతూనే ఉంది. కొన్ని ప్రాంతాల్లో చిరు జల్లులు, మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు పడుతున్నాయి. దీనివల్ల ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడమే కష్టసాధ్యమైంది. వాతావరణ శాఖ ఈరోజు హైదరాబాద్‌కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కొనసాగుతున్న వర్షాల కారణంగా వినాయక చవితి వేడుకలకు ఆటంకం ఏర్పడింది.
వివరాలు
ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం
ఈ రోజు హనుమకొండ, వరంగల్, భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, ఆసిఫాబాద్, ములుగు, సిరిసిల్ల, జనగాం, మెదక్, వనపర్తి, కామారెడ్డి, నిర్మల్, నారాయణపేట్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సంచాలకురాలు డాక్టర్ నాగరత్న వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. గురువారం కూడా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకూడదని అధికారులు సూచించారు.