LOADING...
Rain Alert : నేడు,రేపు తెలంగాణలోని ఈ జిల్లాల్లో వర్షాలు.. అలెర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ.. 
నేడు,రేపు తెలంగాణలోని ఈ జిల్లాల్లో వర్షాలు.. అలెర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ..

Rain Alert : నేడు,రేపు తెలంగాణలోని ఈ జిల్లాల్లో వర్షాలు.. అలెర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 13, 2025
08:39 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా పడుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు నమోదవుతున్నాయి. వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం, వచ్చే రెండు నుంచి మూడు రోజులు కూడా రాష్ట్రంలో ఇలాంటి వాతావరణ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని, అనేక ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర భారతదేశం వైపు నుంచి ప్రారంభమైన నైరుతి రుతుపవనాల నిష్క్రమణ ఇప్పుడు తెలంగాణ ప్రాంతానికి చేరుకుంది. మే నెలాఖరులో దక్షిణ భారత దేశాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు,సెప్టెంబర్ 20వ తేదీ నాటికి ఉత్తర భారతదేశమంతటా వ్యాపించాయి.

వివరాలు 

తెలంగాణ నుంచి నైరుతి రుతుపవనాలు పూర్తిగా నిష్క్రమించే అవకాశం

ఆ తరువాత సెప్టెంబర్ 24నుంచి అవి తిరుగు ప్రయాణం ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అనేక చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ వివరించింది. వాతావరణశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం,ఈ నెల 15వ తేదీ నాటికి తెలంగాణ నుంచి నైరుతి రుతుపవనాలు పూర్తిగా నిష్క్రమించే అవకాశం ఉంది. అందువల్ల ఈ వారం సోమవారం, మంగళవారం రోజుల్లో రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని సూచించారు. వాతావరణ శాఖ ప్రకటన ప్రకారం, ఇవాళ, రేపు పెద్దపల్లి,భద్రాద్రి కొత్తగూడెం,ఖమ్మం,జయశంకర్ భూపాలపల్లి,వరంగల్,హనుమకొండ,జనగామ,మహబూబాబాద్,ములుగు,నల్గొండ,సూర్యాపేట, నాగర్‌కర్నూల్,వనపర్తి,జోగులాంబ గద్వాల,రంగారెడ్డి,మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలతో పాటు హైదరాబాద్ జిల్లాలో కూడా పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

వివరాలు 

లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి 

హైదరాబాద్ నగరంలో ఇప్పటికే సోమవారం ఉదయం నుంచే ఆకాశం మేఘావృతంగా ఉంది. నగరంలోని అనేక ప్రాంతాల్లో జల్లులు పడే అవకాశం ఉండగా, మధ్యాహ్నం తర్వాత మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రోజంతా వాతావరణం మేఘావృతంగానే ఉండి, సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. వర్షం పడుతున్న సమయంలో అత్యవసరం అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు రావొద్దని , వర్షం సమయంలో చెట్ల కింద, హోర్డింగుల దగ్గర లేదా ప్రమాదకర ప్రదేశాల్లో నిలబడవద్దని విజ్ఞప్తి చేశారు. అలాగే లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అలెర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ