Page Loader
Rain Alert: తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వానలే వానలు.. ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు
Rain Alert: తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వానలే వానలు..

Rain Alert: తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వానలే వానలు.. ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 21, 2025
08:13 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. దక్షిణ కర్ణాటక నుంచి దక్షిణ కోస్తాంధ్ర వరకు ద్రోణి కొనసాగుతున్న నేపథ్యంలో శనివారం, ఆదివారం రాష్ట్రంలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ముఖ్యంగా ఆదివారం పగటిపూట నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో అత్యధికంగా 7.5 సెం.మీ వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక సోమవారం, మంగళవారం రోజుల్లో రాష్ట్రంలో మరిన్ని జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశమున్నదని హెచ్చరించింది. ఇప్పటికే సంబంధిత జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈరోజు (సోమవారం),రేపు (మంగళవారం) కూడా పలు జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

వివరాలు 

బుధవారం, గురువారం రోజుల్లో కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు 

అదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, మెదక్, కామారెడ్డి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు అంచనా వేసింది. అలాగే నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, జనగామ, సిద్ధిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, వనపర్తి జిల్లాల్లో సోమవారం, మంగళవారం రోజుల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. బుధవారం, గురువారం రోజుల్లో కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయని, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.