Page Loader
Hyderabad: నగర వాసులకు తీపి కబురు చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం.. మేడ్చల్‌, శామీర్‌పేట్‌కు మెట్రో పొడిగింపు 
గర వాసులకు తీపి కబురు చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం.. మేడ్చల్‌, శామీర్‌పేట్‌కు మెట్రో పొడిగింపు

Hyderabad: నగర వాసులకు తీపి కబురు చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం.. మేడ్చల్‌, శామీర్‌పేట్‌కు మెట్రో పొడిగింపు 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 01, 2025
05:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌ నగరవాసులకు శుభవార్త అందించింది. నగర ఉత్తర ప్రాంతంలో మెట్రో రైల్‌ ప్రాజెక్ట్‌ రూపకల్పనకు కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నూతన సంవత్సర కానుకగా ప్యారడైజ్‌-మేడ్చల్‌ (23 కిలోమీటర్లు), జేబీఎస్‌-శామీర్‌పేట్‌ (22 కిలోమీటర్లు) కారిడార్ల డీపీఆర్‌లు (Detailed Project Reports) సిద్ధం చేయడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఈ డీపీఆర్‌లను వెంటనే సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వం అనుమతికి పంపాలని హెచ్ఎమ్‌ఆర్‌ఎల్‌ (Hyderabad Metro Rail Limited) ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డికి సీఎం ఆదేశించారు. పురపాలక శాఖ ప్రధాన కార్యదర్శి దానకిషోర్‌, హెచ్ఎమ్‌ఆర్‌ఎల్‌ ఎండీతో ఈ ప్రాజెక్టులపై చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు.

వివరాలు 

శామీర్‌పేట్‌ వరకు 22 కిలోమీటర్లు 

ప్యారడైజ్‌ మెట్రో స్టేషన్‌ నుంచి తాడ్‌బండ్‌, బోయిన్‌పల్లి, సుచిత్ర సర్కిల్‌, కొంపల్లి, గుండ్లపోచంపల్లి, కండ్లకోయ, ఆర్‌ఆర్‌ఆర్‌ ఎగ్జిట్‌ మీదుగా మేడ్చల్‌ వరకు 23 కిలోమీటర్ల కారిడార్‌ ఉంటుంది. అలాగే, జేబీఎస్‌ మెట్రో స్టేషన్‌ నుంచి విక్రమ్‌పురి, కార్ఖానా, తిరుమలగిరి, లోతుకుంట, ఆల్వాల్‌, బొల్లారం, హకీంపేట్‌, తూముకుంట, ఓఆర్‌ఆర్‌ ఎగ్జిట్‌ మీదుగా శామీర్‌పేట్‌ వరకు 22 కిలోమీటర్ల కారిడార్‌ విస్తరించి ఉంటుందని మెట్రో ఎండీ సీఎంకు వివరించారు.

వివరాలు 

రూట్‌ మ్యాప్‌ విషయంలో ఎంపీ ఈటల రాజేందర్‌ సూచనలు

మల్కాజిగిరి ఎంపీగా పనిచేసిన సమయంలో ఈ ప్రాంత ట్రాఫిక్‌ సమస్యలు, రూట్‌ మ్యాప్‌లపై తనకు ఉన్న అవగాహనను సీఎం ప్రస్తావించారు. రూట్‌ మ్యాప్‌ విషయంలో ప్రస్తుత మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ సూచనలు తీసుకోవాలని, ఆపై వాటిని డీపీఆర్‌లో పొందుపరచాలని సూచించారు. డీపీఆర్‌ను మూడు నెలల్లో పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఫేజ్‌-2 'ఏ' మాదిరిగానే ఫేజ్‌-2 'బి' భాగాన్ని కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్‌ వెంచర్‌గా రూపొందించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ ప్రతిపాదనలను వెంటనే కేంద్రం అనుమతికి పంపాలని తెలిపారు. ఈ మేరకు డీపీఆర్‌ తయారీ ప్రక్రియ త్వరితగతిన చేపట్టినట్టు మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి వివరించారు.