Page Loader
Telangana: హైదరాబాద్‌ మెట్రో రెండో దశ (బి) ప్రాజెక్టుకు రూ.19,579 కోట్లకు ఆమోదం 
హైదరాబాద్‌ మెట్రో రెండో దశ (బి) ప్రాజెక్టుకు రూ.19,579 కోట్లకు ఆమోదం

Telangana: హైదరాబాద్‌ మెట్రో రెండో దశ (బి) ప్రాజెక్టుకు రూ.19,579 కోట్లకు ఆమోదం 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 17, 2025
08:09 am

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్‌ మెట్రో రైలు రెండో దశ (బి)కు సంబంధించి రూ.19,579 కోట్ల అంచనా వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా పరంగా అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇలంబర్తి సోమవారం అధికారిక ఉత్తర్వులు విడుదల చేశారు. ఈ ప్రాజెక్ట్‌లో మూడు ప్రధాన కారిడార్‌లు ఉంటాయని పేర్కొన్నారు. కారిడార్‌ 9లో రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఫ్యూచర్ సిటీ (స్కిల్స్ యూనివర్సిటీ) వరకు 39.6 కిలోమీటర్లు, కారిడార్‌ 10లో జేబీఎస్‌ నుండి మేడ్చల్‌ వరకు 24.5 కిలోమీటర్లు, కారిడార్‌ 11లో జేబీఎస్‌ నుండి శామీర్‌పేట వరకు 22 కిలోమీటర్ల మార్గాన్ని కలిపి మొత్తం 86.1 కిలోమీటర్ల మేర మెట్రో నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు.

వివరాలు 

తెలంగాణ ప్రభుత్వ వాటా 30 శాతం, కేంద్ర ప్రభుత్వ వాటా 18 శాతం

ఈ భారీ ప్రాజెక్టును హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ మెట్రో లిమిటెడ్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా (జాయింట్ వెంచర్‌ రూపంలో) అమలు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. నిధుల పంపిణీ అంశంలో తెలంగాణ ప్రభుత్వ వాటా 30 శాతం, కేంద్ర ప్రభుత్వ వాటా 18 శాతం, జైకా, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ), న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ (ఎన్డీబీ)ల నుండి రుణంగా 48 శాతం, అలాగే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) కాంపోనెంట్‌ 4 శాతంగా విభజన జరుగుతుందని వివరించారు. ఈ పరిపాలనా అనుమతిని త్వరలో డీటెయిల్డ్ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ (డీపీఆర్‌)కు జతచేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించనున్నట్లు సంబంధిత శాఖ వెల్లడించింది.

వివరాలు 

పాతబస్తీ మెట్రో ప్రాజెక్టుకు రూ.125 కోట్ల విడుదల 

ఇకపోతే, పాతనగరంలోని మెట్రో అనుసంధాన ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.125 కోట్లను విడుదల చేసింది. ఈ నిధుల విడుదలకు సంబంధించి కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇలంబర్తి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2025-26 సంవత్సర బడ్జెట్‌లో పాతబస్తీ మెట్రో అభివృద్ధికి రూ.500 కోట్లు కేటాయించగా, ఇప్పటివరకు అందులో నుంచి రూ.125 కోట్లు విడుదల చేశారు. ఈ నిధులతో పాతబస్తీ మెట్రో ప్రాజెక్టు వేగంగా అమలు చేసే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.