
UIDAI: కోట్ల మంది చనిపోయినా ఇంకా యాక్టివ్‌లోనే ఆధార్ కార్డులు.. ఏం జరుగుతోంది?
ఈ వార్తాకథనం ఏంటి
గత 14 సంవత్సరాల్లో దేశంలో సుమారు 11.7 కోట్ల మంది మరణించినప్పటికీ, ఆధార్ కార్డులు జారీ చేసే భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఇప్పటి వరకు కేవలం 1.15 కోట్ల ఆధార్ నంబర్లను మాత్రమే డీయాక్టివేట్ చేసినట్లు సమాచార హక్కు చట్టం (RTI) ద్వారా వెల్లడైంది. ఇది దేశ మరణాల రేటుతో పోలిస్తే చాలా తక్కువగా ఉన్నట్లు ఈ వివరాలు చెబుతున్నాయి. 2025 జూన్ నాటికి దేశంలో మొత్తం 142.39 కోట్ల మంది ఆధార్ హోల్డర్లు ఉన్నారు. ఇక ఐక్యరాజ్య సమితి (UN) జనాభా గణాంకాల ప్రకారం 2025 ఏప్రిల్ నాటికి భారత్ జనాభా మొత్తం 146.39 కోట్లుగా ఉంది.
వివరాలు
2024 డిసెంబర్ నాటికి 1.15కోట్ల ఆధార్ నంబర్లు డీయాక్టివేట్
2007 నుంచి 2019 మధ్య కాలంలో సంవత్సరానికి సగటున 83.5 లక్షల మంది మరణించినట్లు నమోదు కాగా,ఈ లెక్కన గత 14 ఏళ్లలో 11.69కోట్ల మంది మృతిచెందిన అవకాశం ఉందని లెక్కలు సూచిస్తున్నాయి. కానీ, ఈ కాలవ్యవధిలో ఉడాయ్ కేవలం 1.15కోట్ల ఆధార్ నంబర్లను మాత్రమే మరణాల ఆధారంగా రద్దు చేసింది. ఇది దేశంలోని మొత్తం మరణాల సంఖ్యతో పోల్చితే కేవలం 10 శాతం మాత్రమే. అయితే, ఆధార్ నంబర్లను డీయాక్టివేట్ చేసే ప్రక్రియ పూర్తిగా మరణ ధ్రువీకరణ పత్రాలు,మృతుల కుటుంబ సభ్యులు అందించే సమాచారం ఆధారంగానే కొనసాగుతోందని ఉడాయ్ స్పష్టం చేసింది. 2024 డిసెంబర్ 31నాటికి మరణాల ఆధారంగా మొత్తం 1.15కోట్ల ఆధార్ నంబర్లు డీయాక్టివేట్ చేసినట్లు సంస్థ వెల్లడించింది.