Nara Lokesh: సేల్స్ ఫోర్స్ ప్రెసిడెంట్‌తో మంత్రి లోకేష్ భేటీ.. పెట్టుబడులపై చర్చలు
ఏపీ రాష్ట్రానికి పెట్టుబడులు అందించడమే లక్ష్యంగా విద్య, ఐటి ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. పర్యటనలో భాగంగా ఆయన శాన్ ఫ్రాన్సిస్కోలో ప్రముఖ టెక్ సంస్థ సేల్స్ ఫోర్స్ ప్రెసిడెంట్ శ్రీని తల్లాప్రగడ, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రమేష్ రాగినేనితో సమావేశమయ్యారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, రాష్ట్రంలో ఉన్న సహజ వనరులు, ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు వంటి అంశాలను వారికి వివరించారు. సేల్స్ ఫోర్స్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్ (CRM), క్లౌడ్ టెక్నాలజీలలో ఆధిపత్యాన్ని చాటుతోందన్నారు. వారి కస్టమర్ 360, ఐన్ స్టీన్ ఏఐ వంటి ఆధునిక సొల్యూషన్లు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యాన్ని పొందాయని సేల్స్ ఫోర్స్ ప్రతినిధులు వివరించారు.
అమెరికా
సంస్థ అక్టోబర్ నాటికి మార్కెట్ విలువ $224.14 బిలియన్ డాలర్లు ఉండగా, వార్షిక ఆదాయం $36.46 బిలియన్ డాలర్లుగా నమోదైంది. నారా లోకేష్ మాట్లాడుతూ, ఏపీలో ఈ-గవర్నెన్స్, పబ్లిక్ సర్వీసుల్లో ఏఐ, క్లౌడ్ టెక్నాలజీలను సమర్థవంతంగా వినియోగించడానికి సేల్స్ ఫోర్స్ సహకారం అవసరమన్నారు. ముఖ్యంగా విశాఖపట్నంలో సేల్స్ ఫోర్స్ ఆర్ అండ్ డీ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ ఇన్నోవేటివ్ సొల్యూషన్లు ఏపీలో స్మార్ట్ సిటీలు, CRM ఆధారిత పబ్లిక్ సర్వీసుల కోసం బాగా ఉపయోగపడతాయని చెప్పారు. ఈ పర్యటన ద్వారా ఏపీకి పెట్టుబడులు ఆకర్షించడానికి సేల్స్ ఫోర్స్ వంటి సంస్థలతో సుస్థిరమైన భాగస్వామ్యాలను కుదుర్చుకోవడం దిశగా మంత్రి లోకేష్ ప్రత్యేక దృష్టి సారించారు.