LOADING...
Minister Nadendla: పీడీఎస్ బియ్యం గుర్తించేందుకు రాపిడ్ కిట్ల ఆవిష్కరణ
పీడీఎస్ బియ్యం గుర్తించేందుకు రాపిడ్ కిట్ల ఆవిష్కరణ

Minister Nadendla: పీడీఎస్ బియ్యం గుర్తించేందుకు రాపిడ్ కిట్ల ఆవిష్కరణ

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 13, 2025
01:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

విశాఖపట్టణంలో పీడీఎస్ (పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్) బియ్యాన్ని గుర్తించే రాపిడ్ కిట్లను ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత సంవత్సరం కాకినాడ పోర్టు ద్వారా జరుగుతున్న బియ్యం అక్రమ రవాణాపై ప్రభుత్వం సవివరంగా అధ్యయనం చేసి, దాన్ని అరికట్టేందుకు తగిన చర్యలను చేపట్టినట్లు తెలిపారు. కాకినాడ నుంచి బయలుదేరే ప్రతి సరుకు కంటైనర్‌ను ఇప్పుడు సమగ్రంగా పరిశీలిస్తున్నారు. ఆ పరిశీలన ద్వారా మన దేశానికి సంబంధించిన పీడీఎస్ బియ్యం ఎగుమతి కాకుండా నిరోధక చర్యలు తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు.

వివరాలు 

రూ. 245 కోట్ల బియ్యం స్వాధీనం 

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలల వ్యవధిలో 5 లక్షల 65 వేల క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నామని మంత్రి తెలిపారు. వీటి మొత్తం విలువ సుమారు రూ. 245 కోట్లు ఉంటుందని చెప్పారు. గత ఐదేళ్లలో మునుపటి వైసీపీ ప్రభుత్వం ఇలాంటి కఠిన చర్యలు ఏవీ తీసుకోలేదని ఆయన విమర్శించారు. పీడీఎస్ బియ్యం ఎగుమతులపై ప్రత్యేక దృష్టి పెట్టిన తర్వాత, విశాఖ పోర్టు నుంచీ కూడా కొంత బియ్యం అక్రమంగా పంపిణీ అవుతున్నట్లు గుర్తించామని మంత్రి తెలిపారు. అలాంటి మాఫియా ముఠాలను నియంత్రించడంలో ప్రభుత్వం విజయవంతమవుతోందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న సిబ్బంది ద్వారా ఎగుమతి అవుతున్న బియ్యంపై రసాయన పరీక్షలు నిర్వహించి, జాగ్రత్తలు తీసుకుంటున్నామని నాదెండ్ల మనోహర్ వివరించారు.

వివరాలు 

పీడీఎస్ బియ్యం ఎగుమతి కాకుండా కఠిన చర్యలు: మంత్రి నాదెండ్ల 

విశాఖ నుంచి ఇకపై పీడీఎస్ బియ్యం అక్రమ ఎగుమతులు జరగకుండా కఠిన చర్యలు చేపట్టామని మంత్రి స్పష్టం చేశారు. ఇందుకోసం విశాఖలో 33 మంది సిబ్బందిని నియమించి మూడు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే బియ్యాన్ని కూడా పూర్తిగా తనిఖీ చేస్తున్నామని, నిఘా అధికారులు ఈ ప్రక్రియలో ఏవైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్‌లో అక్రమంగా ఎగుమతి అవుతున్న పీడీఎస్ బియ్యాన్ని గుర్తించేందుకు సిద్ధం చేసిన 700 మొబైల్ టెస్టింగ్ కిట్లను మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియా ముందు ప్రదర్శించారు. ఈ కిట్ల సాయంతో తక్షణ ఫలితాలు పొందడం సాధ్యమవుతుందని, తద్వారా అక్రమ రవాణాను పూర్తిగా అడ్డుకోవచ్చని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.