Nara Lokesh: మొంథా తుపానుపై నిత్యం పర్యవేక్షణ: మంత్రి నారా లోకేష్
ఈ వార్తాకథనం ఏంటి
మొంథా తుపాన్ ప్రభావిత ప్రాంతాల పరిస్థితిని ప్రభుత్వం నిరంతరం గమనిస్తున్నదని మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. మంగళవారం హోంమంత్రి అనితతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రులు, అధికారులు అందరూ తుపానుకు సంబంధించిన సన్నద్ధతలో ఉన్నారని వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ప్రతి క్షణం రాష్ట్రంలోని పరిస్థితులను తెలుసుకుంటున్నారని లోకేష్ తెలిపారు. వర్షాల ప్రభావంతో వాగులు, వంకలు అకస్మాత్తుగా పొంగి ప్రవహించే అవకాశం ఉన్న ప్రాంతాల్లో అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. పరిస్థితులు అవసరమైతే సైన్యాన్ని కూడా సహాయక చర్యల కోసం రంగంలోకి దింపుతామని చెప్పారు.
వివరాలు
నలభై లక్షల మంది ప్రజలపై ప్రభావం
గతంలో తుపాన్లు తెచ్చిన నష్టాల అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని, ఈసారి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత విభాగాలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం మొంథా తుపాను కోస్తాంధ్ర తీరానికి అత్యంత సమీపంగా చేరుకుంటోందని, అర్ధరాత్రి సమయానికి కాకినాడకు దక్షిణంగా తీరాన్ని తాకే అవకాశం ఉందని అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు నివేదించారని తెలిపారు. ప్రస్తుతం కాకినాడ, మచిలీపట్నం,విశాఖపట్టణం వంటి తీరప్రాంతాల్లో భారీ వర్షాలు, బలమైన గాలులు కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ తుపాను దాదాపు నలభై లక్షల మంది ప్రజలపై ప్రభావం చూపుతున్నదని మంత్రి లోకేష్ వివరించారు.