
Rummy in Assembly: అసెంబ్లీలో రమ్మీ ఆడిన మంత్రి.. వీడియో వైరల్!
ఈ వార్తాకథనం ఏంటి
మహారాష్ట్ర వ్యవసాయ మంత్రి మాణిక్‌రావ్ కోకటే మరోసారి వివాదాస్పదస్థితిలో చిక్కుకున్నారు. శాసనసభ సమావేశం జరుగుతున్న సమయంలో ఆయన తన మొబైల్‌లో రమ్మీ ఆడుతున్నట్లు కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఆయనపై విమర్శల వాన మొదలైంది. ఈ ఘటనపై ప్రతిపక్ష పార్టీలతో పాటు శివసేన కూడా తీవ్ర స్థాయిలో స్పందించింది. కోకటే తక్షణమే మంత్రి పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) నాయకుడు రోహిత్ పవార్ తీవ్ర విమర్శలు చేశారు. 'రాష్ట్రవ్యాప్తంగా రోజుకు 8 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వేలాది వ్యవసాయ సమస్యలు ఇంకా పరిష్కారానికోసం ఎదురుచూస్తున్నాయి.
Details
మంత్రి రాజీనామా చేయాలి
కానీ వ్యవసాయ మంత్రికి మాత్రం రమ్మీ ఆడటానికి సమయం దొరుకుతోంది. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. అంతేకాకుండా ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) బీజేపీ అనుమతి లేకుండా ఏ నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో ఉందన్న ఆరోపణలు కూడా చేశారు. ఈ వివాదంపై మంత్రి మాణిక్‌రావ్ కోకటే స్పందించారు. ప్రతిపక్షాలు తనపై అసంపూర్ణ వీడియో ఆధారంగా నిరాధార విమర్శలు చేస్తున్నాయని చెప్పారు. తాను అసలు రమ్మీ ఆడలేదని, ఆట నుంచి ఎగ్జిట్ అవుతుండగా స్క్రీన్‌షాట్ తీసిన వీడియోను తప్పుడు రూపంలో ప్రజల్లోకి తీసుకువస్తున్నారని అన్నారు. అసలు విషయాలు తెలిసేందుకు పూర్తి వీడియోను చూడాలని సూచించారు.
Details
స్పందించిన మంత్రి
సభలో జరుగుతున్న చర్చను యూట్యూబ్‌లో చూడటానికి మొబైల్ తీసుకున్నానని, అదే సమయంలో రమ్మీ యాప్ డౌన్‌లోడ్ అయినట్టు పేర్కొన్నారు. ఈ ఘటనపై అధికారపక్షం ఇంకా అధికారికంగా స్పందించాల్సి ఉంది. అయితే, సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడం, ప్రతిపక్షాల విమర్శలతో మంత్రి పరిస్థితి క్లిష్టంగా మారింది.