
Sarathi Portal: సారధి పోర్టల్ ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్...
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కేంద్రీకృత వాహన సమాచారం వేదిక అయిన "వాహన్ సారధి" పోర్టల్‌లోకి తెలంగాణ రాష్ట్రం ఇవాళ (ఏప్రిల్ 30) అధికారికంగా చేరింది.
ఈ పోర్టల్‌ను రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్ట్‌గా సికింద్రాబాద్‌లోని ఆర్టీఓ కార్యాలయంలో ప్రారంభించారు.
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
వాహనదారులకు డిజిటల్ సేవలు మరింత సులభంగా అందించేందుకు 'సారధి పోర్టల్'ను రాష్ట్రానికి పరిచయం చేశారు.
వాహనాల రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి సేవలన్నింటినీ వినియోగదారులకు మరింత సౌలభ్యంగా అందించడమే దీని ముఖ్య ఉద్దేశం.
వివరాలు
రాష్ట్రవ్యాప్తంగా డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల నమోదు సేవలు
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్రం నుంచి ఎంపీ అనిల్ యాదవ్, రాష్ట్ర ఎమ్మెల్యే శ్రీ గణేష్, ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్, రవాణా కమిషనర్ సురేందర్ మోహన్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తదితరులు హాజరయ్యారు.
ఈ పోర్టల్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల నమోదు సేవలు మరింత వేగవంతం అవుతాయని అంచనా.
రాష్ట్రంలోని ఆర్టీఓ కార్యాలయాల్లో జరగుతున్న కార్యకలాపాలను ఆటోమేటెడ్ విధంగా నిర్వహించేందుకు ఇది సహాయపడుతుంది.
పోర్టల్ ద్వారా వాహనాలకు అనుమతులు (పర్మిట్లు),డ్రైవింగ్ స్కూల్ లైసెన్సులు వంటి అనేక సేవలు కూడా పొందవచ్చు.
ఇప్పటికే దేశంలోని చాలా రాష్ట్రాలు ఈ పోర్టల్‌కు అనుసంధానమై ఉన్నాయి.
వివరాలు
వాహన్ సారధి పోర్టల్‌లో భాగస్వామ్యం కావడం సంతోషం
ఇప్పుడు తెలంగాణ కూడా దీనిలో చేరడమవల్ల,జాతీయ స్థాయిలో వాహన సేవలకు సంబంధించిన సమాచారాన్ని కేంద్రం నిర్వహిస్తున్న నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (NIC) ద్వారా సమగ్రంగా నమోదు చేయగలుగుతుంది.
ఈ సాంకేతిక వేదిక ఉపయోగించి ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వాహన రిజిస్ట్రేషన్ బదిలీ, డ్రైవింగ్ లైసెన్స్ పునర్నవీకరణ,చిరునామా మార్పులు వంటి సేవలను సులభంగా పొందవచ్చు.
ఈ సందర్భంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ,రవాణా శాఖ ఒక సమిష్టి విధానం కింద కేంద్రం,రాష్ట్రాల కలయికతో పనిచేయాల్సిన రంగమని చెప్పారు.
వాహన్ సారధి పోర్టల్‌లో తెలంగాణ ఆలస్యంగా అయినా భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందన్నారు.
వివరాలు
AI ఆధారంగా ట్రాఫిక్ ఉల్లంఘనలపై చర్యలు
అలాగే, రవాణా శాఖలో సంస్కరణలు తీసుకువస్తున్నట్టు పేర్కొన్నారు. రోడ్డుప్రమాదాల నివారణకు రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని, చిన్నారులకు రోడ్ అవేర్‌నెస్ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.
పిల్లల్లో అవగాహన పెంచేందుకు ఇది అవసరమని తెలిపారు.
AI ఆధారంగా ట్రాఫిక్ ఉల్లంఘనలపై చర్యలు తీసుకునే విధానాన్ని అమలు చేస్తున్నట్టు చెప్పారు.
వాయు కాలుష్యం తగ్గించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని, 15 ఏళ్లు దాటిన వాహనాలకు స్క్రాప్ పాలసీను తీసుకువచ్చినట్టు వివరించారు.
ప్రభుత్వం ఎన్నో మంచి నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ ప్రజల సహకారం ఎంతో అవసరమని అన్నారు.
వివరాలు
కేంద్రానికి కృతజ్ఞతలు
ఈ పోర్టల్ ద్వారా ప్రజలకు మధ్యవర్తిత్వం లేకుండా సేవలు అందుతాయని తెలిపారు.
అలాగే కుల గణనపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన డిమాండ్‌ను కేంద్రం పరిగణనలోకి తీసుకోవాలని చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఈ ప్రకటనపై సంతోషం వ్యక్తం చేశారు.
ఇది రాష్ట్ర ప్రభుత్వ విజయమని పేర్కొంటూ, కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు.