LOADING...
Thummala: ఖరీఫ్‌లో ఇంకా 2 లక్షల టన్నుల యూరియా అవసరం: మంత్రి తుమ్మల 
ఖరీఫ్‌లో ఇంకా 2 లక్షల టన్నుల యూరియా అవసరం: మంత్రి తుమ్మల

Thummala: ఖరీఫ్‌లో ఇంకా 2 లక్షల టన్నుల యూరియా అవసరం: మంత్రి తుమ్మల 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 16, 2025
04:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఈ ఖరీఫ్ సీజన్‌లో తెలంగాణకు ఇంకా 2 లక్షల టన్నుల యూరియా ఇవ్వాలని కేంద్రమంత్రి అనుప్రియ పటేల్‌ను అభ్యర్దించినట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కేంద్రమంత్రులతో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎరువుల సరఫరాలో రైతులకు ఎదురయ్యే సమస్యలపై కూడా చర్చలు జరిగాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. భారత్ ఎక్కువగా ఎరువులను దిగుమతిపై ఆధారపడి ఉండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రైతులను కాపాడడం కోసం కొన్ని కీలక చర్చలు జరిగాయని ఆయన పేర్కొన్నారు. 1968లో చేసిన విత్తన చట్టానికి మార్పులు చేయాల్సిన అవసరం ఉంది

వివరాలు 

ఆయిల్‌ పామ్‌ సాగును ప్రోత్సహించేందుకు దిగుమతి సుంకాలు

1968లో చేసిన విత్తన చట్టానికి మార్పులు చేయాల్సిన అవసరం ఉందని,తద్వారా ఆధునిక పరిస్థితులకు తగిన కొత్త చట్టాన్ని వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదించాలని కోరామని తుమ్మల చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేని రైతు సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తోందని ఆయన ప్రత్యేకంగా చెప్పారు. అదే విధంగా, దేశంలో ఆయిల్‌ పామ్‌ సాగును ప్రోత్సహించేందుకు దిగుమతి సుంకాలు పెంచాలని కోరాం.

వివరాలు 

కొత్తగూడెం విమానాశ్రయం గురించి కేంద్రమంత్రితో చర్చ 

ఇటీవల కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడితో కలిసి కొత్తగూడెం విమానాశ్రయం నిర్మాణం గురించి చర్చించామని తుమ్మల తెలిపారు. అంతేకాకుండా, వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాల నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ పూర్తయ్యిందని కూడా కేంద్రానికి తెలియజేశామని తెలిపారు. అంతే కాకుండా, కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామిని కలిసిన సందర్భంలో బయ్యారం స్టీల్ వ్యవహారంలో తెలంగాణకు న్యాయం చేయాలని స్పష్టంగా అభ్యర్థించామని తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు.