Telangana: సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో వేగం పెంచండి: మంత్రి ఉత్తమ్
ఈ వార్తాకథనం ఏంటి
సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో మరింత వేగం తీసుకురావాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సోమవారం రాత్రి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్‌సీ అంజద్ హుస్సేన్ ఇతర ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించి, వివిధ ప్రాజెక్టుల ప్రగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 16న ముఖ్యమంత్రి ప్రారంభించనున్న చనఖా-కోర్టా పంపుహౌస్‌లు, సదర్‌మాట్ బ్యారేజీ పనుల స్థితిగతులపై ప్రత్యేకంగా చర్చించారు. అలాగే కాళేశ్వరం బ్యారేజీల పునరావాసానికి సంబంధించిన కొత్త డిజైన్లు, ఎస్సెల్‌బీసీ, తుమ్మిడిహెట్టి బ్యారేజీ డీపీఆర్ తయారీపై కూడా మంత్రి ఆరా తీశారు.
వివరాలు
ప్రాజెక్టులో రెండు పంపుహౌస్‌లు
ముఖ్యమంత్రి ప్రారంభించనున్న ప్రాజెక్టుల వివరాలపై అధికారులు సమగ్రంగా వివరించారు. దిగువ పెన్‌గంగా నదిపై మహారాష్ట్రలోని చనఖా గ్రామం, ఆదిలాబాద్ జిల్లాలోని కోర్ట గ్రామాల మధ్య చనఖా-కోర్టా ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. రూ.795 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో రెండు పంపుహౌస్‌లు ఉన్నాయి. తొలి దశలో 5.5 మెగావాట్ల సామర్థ్యం గల పంపులతో కూడిన పంపుహౌస్ ద్వారా 13,500 ఎకరాల ఆయకట్టుకు నీరు అందేలా ప్రణాళిక రూపొందించారు. రెండో దశలో 12 మెగావాట్ల పంపులు ఏర్పాటు చేయగా, వీటి ద్వారా 37,500 ఎకరాల వరకు సాగునీరు అందించనున్నారు.
వివరాలు
గోదావరి నదిపై నిర్మించిన సదర్‌మాట్ బ్యారేజీపై సమీక్ష
ఇదే విధంగా గోదావరి నదిపై నిర్మించిన సదర్‌మాట్ బ్యారేజీ వివరాలను కూడా మంత్రి సమీక్షించారు. నిర్మల్ జిల్లా మామడ మండలం పొన్కల్ గ్రామం, జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మధ్య ఈ బ్యారేజీని నిర్మించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 18 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాదు, మామడ, ఖానాపూర్ మండలాలకు తాగునీటి సరఫరా చేయనున్నారు. రూ.676 కోట్ల వ్యయంతో, 1.58 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో సదర్‌మాట్ బ్యారేజీ నిర్మాణం పూర్తయ్యిందని అధికారులు వివరించారు.