
Telangana Cabinet meeting: సన్న వడ్లకు రూ.500 బోనస్ .. రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం వర్షాకాలపు పంటలలో ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. అదనంగా, సన్నవడ్లకు రైతుల ఖాతాల్లో ₹500 బోనస్ వెంటనే జమ చేయాలని కూడా తీర్మానించింది. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మంత్రి కొండా సురేఖను తప్పించి మిగతా మంత్రులు అందరూ హాజరయ్యారు. సమావేశం తర్వాత,మంత్రి వాకిటి శ్రీహరి,ఎంపీ బలరాంనాయక్‌లతో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాకు వివరాలు తెలిపారు.
వివరాలు
మద్దతు ధరతో పాటు ₹500 బోనస్ రైతుల ఖాతాల్లో జమ
ఈసారి వర్షాకాలంలో కనీవినీ ఎరుగని రీతిలో వరిపంట దిగుబడి రాబోతోంది. ప్రాథమిక అంచనాల ప్రకారం.. 1.48 కోట్ల టన్నుల ధాన్యాన్ని రైతన్నలు పండించారు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి కృషి ఇందులో కనిపిస్తుంది. రాష్ట్రానికి 80 లక్షల టన్నుల ధాన్యం అవసరం ఉన్నా కేంద్రం కేవలం 50 లక్షల టన్నులు మాత్రమే తీసుకుంటుందని సూచించింది. మిగిలిన ధాన్యాన్ని రాష్ట్రం రైతుల నుంచి కొనుగోలు చేస్తుందని నిర్ణయించారు. అన్ని కొనుగోలు కేంద్రాలలో రెవెన్యూ, పౌర సరఫరా, రవాణా శాఖల అధికారులు సమన్వయంతో, మద్దతు ధరతో పాటు ₹500 బోనస్ రైతుల ఖాతాల్లో జమ చేయాలని ఆదేశించారు. ప్రతి కేంద్రాన్ని కలెక్టర్లు,అదనపు కలెక్టర్లు తనిఖీ చేసి, ప్రత్యేక బాధ్యతలు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు.
వివరాలు
మెట్రో రైలు విస్తరణ
హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణపై మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించి, వేగవంతం చేయాలని నిర్ణయించింది. మెట్రో 2A, 2B విస్తరణలో అడ్డంకులుగా మారిన మొదటి దశను పీపీపీ మోడల్‌లో నిర్వహిస్తున్న L&T నుంచి స్వాధీనం చేసుకునే అంశంపై చర్చ జరిగింది. స్వాధీనం సమస్యలపై లోతైన అధ్యయనానికి ప్రత్యేక ఉన్నతాధికారుల కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) చైర్మన్, ఆర్థిక శాఖ, MA&UD కార్యదర్శులు, లా సెక్రెటరీ, మెట్రో MD, అర్బన్ ట్రాన్స్‌పోర్ట్ అడ్వయిజర్ సభ్యులుగా ఉంటారు. కమిటీ నివేదికను క్యాబినెట్ సబ్-కమిటీకి అందిస్తుంది. ఉపసంఘ సిఫార్సుల ఆధారంగా మెట్రో స్వాధీనం కోసం తుది నిర్ణయం తీసుకోవాలని మంత్రివర్గం తీర్మానించింది.
వివరాలు
స్థానిక సంస్థల ఎన్నికల నిబంధన
గత ప్రభుత్వంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండు పిల్లల నిబంధన ఉండేది. దీనిని మినహాయించి, మంత్రివర్గం పునరాలోచన చేసి,ఈ నిబంధనను రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో జనాభా నియంత్రణ కఠినంగా అమలవుతున్నందున, గరిష్ట నిబంధన అవసరం లేదని పేర్కొన్నారు. ఇతర కీలక తీర్మానాలు హుజూర్‌నగర్, కొడంగల్, నిజామాబాద్‌లో ఆధునిక సౌకర్యాలతో అగ్రికల్చర్ కాలేజీలు ఏర్పాటు. ప్రజా పాలన రెండవ సంవత్సరం పూర్తి అవుతున్న సందర్భంగా, డిసెంబర్ 1-9వరకు'ప్రజా పాలన - ప్రజా విజయోత్సవాలు' నిర్వహణ; ఏర్పాట్లపై ఉపసంఘం ఏర్పాటు. భద్రాద్రి జిల్లా జూలూరుపాడులో ఏన్కూర్ మార్కెట్ యార్డ్‌కు 10 ఎకరాల భూమి కేటాయింపు. NALSAR న్యాయ విశ్వవిద్యాలయానికి అదనంగా 7ఎకరాలు భూమి కేటాయింపు; తెలంగాణ స్థానికులకు 25%రిజర్వేషన్‌ను 50%కి పెంపు.
వివరాలు
ఇతర కీలక తీర్మానాలు
రోడ్లు, భవనాల శాఖలో ₹10,547 కోట్లు వ్యయం, 5,566 కి.మీ. రోడ్ల నిర్మాణం హ్యామ్ విధానంలో; జాతీయ, జిల్లా, మండల కేంద్రాలు, పర్యాటక ప్రాంతాలతో అనుసంధానం. ప్యారడైజ్ జంక్షన్ నుండి శామీర్‌పేట ORR, డెయిరీఫాం రోడ్ వరకు ఎలివేటెడ్ కారిడార్ల కోసం భూసమస్య పరిష్కారం, 435.08 ఎకరాలు భూమి కేటాయింపు. కృష్ణా-వికారాబాద్ బ్రాడ్‌గేజ్ రైలు మార్గం నిర్మాణానికి 845 హెక్టార్ల భూసేకరణలో ₹438 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. మన్ననూర్-శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి రూ.7,500 కోట్ల వ్యయం, రాష్ట్ర-కేంద్ర భాగస్వామ్యం; 75 కి.మీ. పొడవు, మూడోవంతు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది.
వివరాలు
ఇతర కీలక తీర్మానాలు
మన్ననూర్-శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సంబంధించి,రిజర్వు ఫారెస్ట్‌లో 7,500 కోట్ల రూపాయల వ్యయంతో, రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో 75 కిలోమీటర్ల పొడవుతో హై-లెవల్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది అని పొంగులేటి వివరించారు. మొత్తం వ్యయంలో మూడో భాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించడానికి అంగీకరించిందని కూడా మంత్రివర్గం తీర్మానించిందని ఆయన పేర్కొన్నారు.
వివరాలు
కొండా సురేఖ అంశం టీ కప్పులో తుపాను లాంటిది
క్యాబినెట్ భేటీకి సురేఖ హాజరుకాని అంశంపై విలేకరులు ప్రశ్నించగా.. "ఆ చర్చ ఏమీ జరగలేదు. అది చిన్న అంశం మాత్రమే. టీ కప్పులో తుపాను లాంటిది. కొందరు సముద్రంలో తుపానులా పెద్దగా చర్చించినట్లు చూపించారు. త్వరలోనే పరిస్థితి సర్దుకుపోతోంది." అదే విధంగా, ఈ నెల 23న జరగనున్న మంత్రివర్గ సమావేశంలో శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్.ఎల్.బి.సి.) సొరంగ మార్గం పనిని ప్రస్తుత గుత్తేదారుతో కొనసాగించాలా, లేక కొత్త గుత్తేదారుకు అప్పగించాలా అనే విషయంపై చర్చ జరగనుందని తెలుస్తోంది.
వివరాలు
బీసీ రిజర్వేషన్లపై నిర్ణయానికి 23న క్యాబినెట్ భేటీ
బీసీ వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు పెంపు చేయడంపై సుప్రీంకోర్టులో దాఖలైన ఎస్‌ఎల్‌పీ తిరస్కరించబడటంతో, రాష్ట్ర మంత్రివర్గం తదుపరి చర్యలపై సమీక్ష నిర్వహించింది. కేసును వాదించిన సీనియర్ న్యాయవాదులు, న్యాయ నిపుణుల సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకొని ముందడుగు వేయాలని నిర్ణయించుకుంది. మంత్రివర్గం అధికారులు రెండు రోజుల లోపల న్యాయ నిపుణుల అభిప్రాయాలను సేకరించి, దాని ఆధారంగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది. బీసీ రిజర్వేషన్ల విషయంలో తుదిపరిణామ నిర్ణయం తీసుకోవడానికి ఈ నెల 23న మళ్లీ మంత్రివర్గం సమావేశం కావాలని నిర్ణయించింది. సీనియర్ న్యాయవాదుల నుండి అన్ని వివరాలను పొందిన తర్వాత, ఇతర బీసీ సంఘాల ప్రతినిధులతో చర్చలు నిర్వహించి, తదుపరి కార్యాచరణపై సమగ్రంగా నిర్ణయం తీసుకోవాలని మంత్రివర్గం నిర్ణయించింది.