LOADING...
Air India Pilots: ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం తర్వాత 112 మంది పైలట్లు సిక్ లీవ్‌ 
ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం తర్వాత 112 మంది పైలట్లు సిక్ లీవ్‌

Air India Pilots: ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం తర్వాత 112 మంది పైలట్లు సిక్ లీవ్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 24, 2025
05:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

అహ్మదాబాద్‌లో ఇటీవల చోటుచేసుకున్న ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం(Air India Crash) దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ విషాద సంఘటన విమాన సిబ్బందిపై, ముఖ్యంగా పైలట్ల మనోవైజ్ఞానిక స్థితిపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఈ నేపథ్యంలో,ఎయిరిండియాలో పని చేస్తున్న వందలకుపైగా పైలట్లు సడెన్‌గా సిక్ లీవ్‌పై వెళ్లినట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. గత నెల 12వ తేదీన జరిగిన ఈ దుర్ఘటన అనంతరం సంస్థలో సిక్ లీవ్‌ల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు పేర్కొంటూ,పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్,ఈ విషయాన్ని లోక్‌సభలో తెలిపారు. ఆయన వివరించిన మేరకు,నాలుగు రోజుల్లో మొత్తం 112మంది పైలట్లు సిక్ లీవ్ తీసుకున్నారు.

వివరాలు 

'పీర్ సపోర్ట్ గ్రూప్‌లు' ఏర్పాటు

వీరిలో 51 మంది కమాండర్ స్థాయి పైలట్లు (P1) కాగా, మిగతా 61 మంది ఫస్ట్ ఆఫీసర్లు (P2) ఉన్నారు. అంతేకాదు,2023 సంవత్సరంలో ఎయిర్‌లైన్స్‌కు జారీ చేసిన నోటీసుల విషయాన్ని కూడా మంత్రి ప్రస్తావించారు. వాటిలో విమాన సిబ్బంది వైద్య పరీక్షల సమయంలో మానసిక ఆరోగ్యాన్ని సమగ్రంగా,వేగంగా అంచనా వేసే ప్రక్రియలు అవసరమని సూచించినట్టు తెలిపారు. అదనంగా,ఏవైనా మానసిక సమస్యలు తలెత్తినప్పుడు,పైలట్లు,ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు తక్షణ సహాయం పొందేలా 'పీర్ సపోర్ట్ గ్రూప్‌లు' ఏర్పాటు చేయాలని సలహాలు ఇచ్చినట్టు వెల్లడించారు. అహ్మదాబాద్‌ నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం (ఎయిర్ ఇండియా AI171) ప్రమాదవశాత్తూ భవనంపై కూలిపోయింది.

వివరాలు 

ఎయిర్ ఇండియాకు నాలుగు షోకాజ్ నోటీసులు

ఈ విషాద ఘటనలో 241 మంది ప్రయాణికులు మృతి చెందగా, భవనంలో ఉన్న మరో 19 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 260కి చేరింది. ఈ దుర్ఘటన నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) తీవ్రమైన చర్యలు చేపట్టింది. విమాన భద్రత, సిబ్బంది ప్రవర్తనపరంగా నిర్లక్ష్యంపై DGCA దృష్టి పెట్టింది. ఈ క్రమంలో ఎయిర్ ఇండియాకు నాలుగు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వాటిలో, క్యాబిన్ సిబ్బంది విశ్రాంతి సమయం, శిక్షణ నియమాలు, నిర్వహణ విధానాల పరంగా కొన్ని నిబంధనలను ఉల్లంఘించినట్టు ఎయిర్ ఇండియా అధికారికంగా అంగీకరించినట్టు సమాచారం.