
Mithun Reddy: మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డికి రిమాండ్
ఈ వార్తాకథనం ఏంటి
ఏపీ మద్యం కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి విజయవాడలోని ఏసీబీ కోర్టు ఆగస్టు 1 వరకు రిమాండ్ విధించింది. శనివారం సిట్ అధికారులు అరెస్టు చేసిన ఆయనను, వైద్య పరీక్షల అనంతరం, ఆదివారం కోర్టులో హాజరుపరిచారు. సిట్ కార్యాలయం నుంచి ముందుగా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన మిథున్‌రెడ్డికి బీపీ, షుగర్, ఈసీజీ వంటి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఏసీబీ కోర్టు ముందు హాజరుపరిచారు. అరెస్టుకు గల 29 కారణాలను కోర్టులో వివరించిన సిట్ అధికారులు, మిథున్‌పై సెక్షన్ 409, 420, 120(బీ) రెడ్ విత్ 34, 37, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ సెక్షన్లు 7, 7ఏ, 8,13(1)(బీ),13(2) కింద కేసు నమోదు చేశామని తెలిపారు.
Details
రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపు
కోర్టు విచారణ సందర్భంగా, సిట్ తరఫున న్యాయవాది కోటేశ్వరరావు వాదనలు వినిపించారు. మిథున్‌రెడ్డిని పోలీస్ కస్టడీలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ గుంటూరు సబ్ జైలులో రిమాండ్ ఇవ్వాలన్నారు. మిథున్‌రెడ్డి వై కేటగిరీ భద్రత కలిగిన ఎంపీ అని, రిమాండ్ విధిస్తే నెల్లూరు జైలులో ప్రత్యేక బ్యారక్ ఏర్పాటు చేయాలంటూ ఆయన తరఫు న్యాయవాది నాగార్జునరెడ్డి అభ్యర్థించారు. మిథున్‌రెడ్డి ప్యానెల్ స్పీకర్‌గా పనిచేస్తున్నప్పటికీ, ఆయన అరెస్టుపై స్పీకర్‌కు సమాచారం ఇవ్వలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వాదనలు పూర్తయ్యాక, న్యాయమూర్తి మిథున్‌రెడ్డిని ఆగస్టు 1 వరకు రిమాండ్‌లో ఉంచాలని ఆదేశించారు. పోలీసులు అతడిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించనున్నారు.