అమరావతి రైతులకు ఎమ్మెల్యే శ్రీదేవి క్షమాపణలు.. వైసీపీని తుక్కుగా ఓడించాలని పిలుపు
ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ పాదయాత్ర సందర్భంగా ఆమె అధికార పార్టీని తీవ్రంగా విమర్శించారు. తన కారణంగా అమరావతి రైతులకు జరిగిన నష్టంపై శ్రీదేవి క్షమాపణలు కోరారు. వైసీపీ గుర్తుపై గెలవడం వల్లే ఉద్యమంలోకి ముందుగా రాలేకపోయానన్నారు. రాజధాని ఇక్కడే ఉంటుందని చెప్పిన తాను కూడా ప్రజల్ని మోసం చేశానన్నారు. రైతులు పడుతున్న బాధలను తానూ పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై రోజూ ఏడ్చేదాన్ని అని ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ రాక్షస పాలన నుంచి ఎప్పుడు బయటపడతానా అని ఎదురుచూసినట్లు తెలిపారు. తన ప్రాణం పోయినా అమరావతి సాధించే వరకు రైతులతో కలసి పోరాడతానన్నారు.
నా వెనుక చంద్రబాబు, లోకేష్ ఉన్నారు, నన్నెవరూ ఏమీ చేయలేరు : ఉండవల్లి శ్రీదేవి
అమరావతి కేంద్రంగానే వైసీపీ పతనం ప్రారంభమైందన్నారు. ఇప్పుడు తన వెనుక చంద్రబాబు, లోకేశ్ ఉన్నారని, తనను ఎవరూ ఏమీ చేయలేరన్నారు. యువగళం పాదయాత్రలో భాగంగా అమరావతి ఆక్రందన పేరిట రాజధాని రైతులతో చేపట్టిన ముఖాముఖి కార్యక్రమంలో లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీదేవి హోస్ట్ గా వ్యవహరించారు. ప్రజల కోసం పోరాడుతున్న తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలని, 2024 ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలిపించాలని శ్రీదేవి అభ్యర్థించారు. ప్రజా రాజధాని అమరావతి కల నెరవేరాలంటే చంద్రబాబే అధికారంలోకి రావాలన్నారు. దేవతల రాజధానిని తలపించేలా అమరావతిని నిర్మిస్తారన్నారు. రైతులపై అధికార పక్షం, పోలీసులతో జులుం ప్రదర్శిస్తోందన్నారు. రైతులకు ఏమైనా నష్టం చేయదల్చుకుంటే వారి ముందు శ్రీదేవి ఉంటుందన్నారు.