
Weather Update: తెలంగాణలో మోస్తరు వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరికలు
ఈ వార్తాకథనం ఏంటి
క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
బుధవారం, గురువారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురు గాలులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది.
జయశంకర్ భూపాలపల్లి, ములుగు, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
ఈ జిల్లాలకు ఇప్పటికే ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసినట్టు స్పష్టం చేసింది.
Details
ఎల్లో హెచ్చరికలు జారీ
అలానే సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ, ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసినట్టు తెలిపింది.
అదే విధంగా ఏప్రిల్ 10న సిద్దిపేట, హనుమకొండ, వరంగల్, జనగాం, మహబూబాబాద్, హైదరాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
ఈ జిల్లాల్లోనూ ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు పేర్కొంది. ఈ వర్షాలు వాతావరణ మార్పులతో పాటు వ్యవసాయానికి ఉపకరించవచ్చన్న అంచనాలు ఉన్నాయి.
ప్రజలు వర్షపాత సమయంలో సురక్షితంగా ఉండాలని, అవసరమైన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.