Rahul Gandi: దేశ ఆర్థిక వ్యవస్థ క్షీణతకు మోదీ ప్రభుత్వ చర్యలే కారణం
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కేంద్రం పారదర్శకంగా పనిచేయకుండా, చట్ట ప్రకారం జరిగే వ్యాపారాలపై దృష్టి పెట్టకుండా, క్రోనీ క్యాపిటలిజానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ తీసుకుంటున్న చర్యలు, దేశంలోని తయారీ రంగాన్ని బలహీనపరిచాయని, కరెన్సీ విలువ పడిపోతుందని రాహుల్ గాంధీ చెప్పారు. రికార్డు స్థాయిలో వాణిజ్య లోటు, అధిక వడ్డీ రేట్లతో వస్తువుల వినియోగం తగ్గిపోతోందన్నారు. ఇటీవల దేశంలో వాణిజ్య లోటు, దిగుమతులు గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయని, కేంద్రం అధిక ఆదాయ కేటాయింపుల వల్ల మరిన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుందని హెచ్చరించారు. నవంబరులో దేశీయ ఎగుమతులు 4.85% తగ్గి 32.11 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి.
రాబోయే కాలంలో మరిన్ని ఆర్థిక సంక్షోభాలు
వాణిజ్యలోటు 37.84 బిలియన్ డాలర్లకు పెరిగింది, ఇది జీవనకాల గరిష్ఠ స్థాయికి చేరుకోవడం విశేషం. పసిడి దిగుమతులు ఈ నెలలో రికార్డు స్థాయిలో 14.86 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. గతేడాది ఇదే నెలతో పోలిస్తే 4 రెట్లు అధికం. ఏప్రిల్-నవంబరులో పసిడి దిగుమతులు 49 బిలియన్ డాలర్లను తాకాయి, ఇది గతేడాది 32.93 బిలియన్ డాలర్లతో పోలిస్తే అధికం. వంట నూనె, ఎరువులు, వెండి వంటి ఇతర ఇన్‌బౌండ్ షిప్‌మెంట్ల కారణంగా దిగుమతులు 69.95 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఈ వివరాలను ఉటంకిస్తూ రాహుల్ గాంధీ, కేంద్ర ప్రభుత్వ విధానాలు దేశ ఆర్థిక పరిస్థితిని మరింత క్షీణపరుస్తున్నాయని, రాబోయే కాలంలో మరిన్ని ఆర్థిక సంక్షోభాలు రానున్నాయని చెబుతున్నారు.