Loading...
Asean Summit 2026: ఫిలిప్పీన్స్‌కు ప్రధాని మోదీ.. ఆసియాన్, ఈస్ట్ ఏషియా, క్వాడ్ సదస్సుల్లో పాల్గొననున్న ప్రధాని!
ఫిలిప్పీన్స్‌కు ప్రధాని మోదీ..

Asean Summit 2026: ఫిలిప్పీన్స్‌కు ప్రధాని మోదీ.. ఆసియాన్, ఈస్ట్ ఏషియా, క్వాడ్ సదస్సుల్లో పాల్గొననున్న ప్రధాని!

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 16, 2026
09:06 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఫిలిప్పీన్స్‌కు వెళ్లనున్నారు. నవంబర్ 16, 17 తేదీల్లో ఆయన అక్కడ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా 23వ ఆసియాన్-భారత్ శిఖరాగ్ర సదస్సు, 21వ తూర్పు ఆసియా సదస్సులో పాల్గొంటారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో మారుతున్న భౌగోళిక రాజకీయ పరిణామాలు, భద్రతాపరమైన సవాళ్ల నేపథ్యంలో ఆగ్నేయాసియా దేశాలతో భారత్ సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం. ముఖ్యంగా వ్యూహాత్మక, ఆర్థిక సహకారాన్ని పెంచుకోవడంపై భారత్ దృష్టి సారించనుంది.

వివరాలు 

మంగళవారం ప్రధాన సదస్సులు

ఈ రెండు సదస్సులతో పాటు భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలతో కూడిన క్వాడ్ (Quad) శిఖరాగ్ర సమావేశంలోనూ ప్రధాని మోదీ పాల్గొననున్నారు.

ఈ ఏడాది ఆసియాన్ కూటమికి అధ్యక్షత వహిస్తున్న ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ ఆర్. మార్కోస్ జూనియర్ సోమవారం రాత్రి ఆసియాన్ దేశాలు, భాగస్వామ్య దేశాల అధినేతలకు విందు ఇవ్వనున్నారు.

మంగళవారం (నవంబర్ 17) ప్రధాన సదస్సులు జరగనున్నాయి. ఈ పర్యటనలో భారత్ ప్రస్తావించనున్న కీలక అంశాలు ఇవే..

వివరాలు 

1. ఆసియాన్‌తో వాణిజ్యం, పెట్టుబడులు.. అనుసంధానతకు ప్రాధాన్యం

23వ ఆసియాన్-భారత్ శిఖరాగ్ర సదస్సులో భాగంగా 11 సభ్యదేశాలతో కూడిన ఆగ్నేయాసియా దేశాల కూటమితో భారత్‌కు ఉన్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంపై ప్రధాని మోదీ సమీక్షించనున్నారు.

ఇరు పక్షాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, డిజిటల్ పరివర్తన, రవాణా, సమాచార అనుసంధానత, విపత్తుల నివారణ, అభివృద్ధి సహకారం వంటి అంశాలు చర్చకు రానున్నాయి.

అలాగే 2026-2030 కాలానికి రూపొందించిన 'ఆసియాన్-ఇండియా ప్లాన్ ఆఫ్ యాక్షన్' అమలు పురోగతిని కూడా నేతలు పరిశీలించనున్నారు.

ప్రస్తుతం ఆసియాన్ దేశాలతో భారత్ వార్షిక వాణిజ్యం సుమారు 122 బిలియన్ డాలర్లుగా ఉంది.

దీంతో ఈ కూటమి భారత్‌కు అత్యంత ముఖ్యమైన ఆర్థిక భాగస్వాముల్లో ఒకటిగా కొనసాగుతోంది.

ADVERTISEMENT

వివరాలు 

2. సముద్ర భద్రత, రక్షణ రంగంలో సహకారం

2026 సంవత్సరాన్ని భారత్, ఆసియాన్ దేశాలు 'ఆసియాన్-ఇండియా సముద్ర సహకార సంవత్సరం'గా నిర్వహిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ పర్యటనలో సముద్ర భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

సముద్ర మార్గాల రక్షణ,బ్లూ ఎకానమీ అభివృద్ధితో పాటు రక్షణ రంగంలో పరస్పర సహకారాన్ని పెంచుకోవడంపై చర్చలు జరగనున్నాయి.

ముఖ్యంగా గస్తీ నౌకలు, రాడార్లు,గగనతల రక్షణ వ్యవస్థలు,హెలికాప్టర్లు,డ్రోన్ల సరఫరా వంటి అంశాలపై భారత్ దృష్టి పెట్టనుంది.

ఇప్పటికే సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 2 వరకు రెండో ఆసియాన్-ఇండియా సముద్ర విన్యాసాలు జరిగాయి.

అలాగే అక్టోబర్‌లో ఢిల్లీలో రక్షణ రంగానికి సంబంధించిన థింక్ ట్యాంక్ ఫోరమ్ నిర్వహించారు.

ఈ కార్యక్రమాల ద్వారా ప్రారంభమైన సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా తాజా సదస్సులో చర్చలు జరగనున్నాయి.

ADVERTISEMENT

వివరాలు 

3. తూర్పు ఆసియా సదస్సు.. ఇండో-పసిఫిక్ భద్రతపై చర్చ

21వ తూర్పు ఆసియా సదస్సులో ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలతో పాటు ఇండో-పసిఫిక్ ప్రాంత భద్రతపై ప్రధాని మోదీ తన అభిప్రాయాలను వెల్లడించనున్నారు.

ఈ ప్రాంతం స్వేచ్ఛాయుతంగా, అన్ని దేశాలకు సమాన అవకాశాలు కల్పించేలా ఉండాలని భారత్ మరోసారి స్పష్టం చేయనుంది.

ఐక్యరాజ్యసమితి సముద్ర చట్టాల ఒప్పందం (UNCLOS) ప్రకారం ప్రతి దేశ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత, సముద్ర మార్గాల్లో స్వేచ్ఛాయుత నౌకాయాన హక్కులను గౌరవించాలని భారత్ పిలుపునివ్వనుంది.

అంతేకాకుండా ఉగ్రవాదం, సరిహద్దు ప్రాంతాల్లో జరిగే నేరాలు, సైబర్ మోసాలు, మానవ అక్రమ రవాణా, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, మనీలాండరింగ్ వంటి సమస్యలను ఎదుర్కోవడంలో దేశాల మధ్య సహకారాన్ని పెంచుకోవాల్సిన అవసరాన్ని కూడా ఈ సదస్సులో ప్రస్తావించనున్నారు.

వివరాలు 

4. క్వాడ్ సదస్సు.. చైనా ప్రభావానికి అడ్డుకట్ట, వ్యూహాత్మక మౌలిక సదుపాయాలు

ప్రధాని మోదీ పర్యటనలో క్వాడ్ దేశాల అధినేతల సమావేశం అత్యంత ప్రాధాన్యం సంతరించుకోనుంది.

భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాల నాయకులు ఈ భేటీలో పాల్గొననున్నారు.

2024 సెప్టెంబర్ తర్వాత ఈ నాలుగు దేశాల అధినేతలు ఒకే వేదికపై సమావేశం కావడం ఇదే తొలిసారి.

ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా పెంచుకుంటున్న సైనిక ప్రభావాన్ని ఎదుర్కోవడం, ఆర్థిక భద్రతను బలోపేతం చేయడం, వ్యూహాత్మక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం వంటి అంశాలు ఈ సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది.

వివరాలు 

4. క్వాడ్ సదస్సు.. చైనా ప్రభావానికి అడ్డుకట్ట, వ్యూహాత్మక మౌలిక సదుపాయాలు

ఇదిలా ఉండగా.. అక్టోబర్ 31న అట్లాంటాలో జరిగిన క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో ఇండో-పసిఫిక్ దేశాల్లో విశ్వసనీయమైన కృత్రిమ మేధ (AI) సాంకేతికత అభివృద్ధికి 85 మిలియన్ డాలర్లకు పైగా ఆర్థిక, సాంకేతిక సహాయం అందించాలని నిర్ణయించారు.

సాధారణంగా క్వాడ్ సభ్యదేశాల్లోనే ఈ శిఖరాగ్ర సమావేశాలు నిర్వహిస్తుంటారు. అయితే ఈసారి అమెరికా ఆధ్వర్యంలో ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో సమావేశం జరగనుండటం విశేషం.

ADVERTISEMENT