PM Modi: 'గుజరాత్ సీన్ కేరళలో రిపీట్ అవుతుంది'.. తిరువనంతపురం ర్యాలీలో మోదీ
ఈ వార్తాకథనం ఏంటి
కేరళలో రాజకీయ మార్పు తప్పనిసరిగా జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. తిరువనంతపురంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గుజరాత్‌లో భాజపా ఎదుగుదల ఒకే ఒక నగరం నుంచి మొదలైందని గుర్తు చేసిన మోదీ, అదే తరహా పరిస్థితి కేరళలోనూ పునరావృతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల నగరంలో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో భాజపా సాధించిన విజయాన్ని ఉదాహరణగా చూపుతూ ఆయన ఈ మాటలు చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్రాన్ని పాలిస్తున్న లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డీఎఫ్), కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్)లపై ప్రధాని తీవ్ర విమర్శలు చేశారు.
వివరాలు
అవే రాష్ట్రాన్ని నష్టపరిచాయి..
ఈ రెండు కూటముల అవినీతికి తాము చెక్ పెడతామని ప్రకటించారు. రాబోయే ఎన్నికలు కేరళ పరిస్థితులను పూర్తిగా మార్చేస్తాయని అన్నారు. ఇప్పటివరకు ప్రజలు ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్ అనే రెండు వైపులనే చూశారని, అవే రాష్ట్రాన్ని నష్టపరిచాయని విమర్శించారు. అయితే ఇప్పుడు మూడో ప్రత్యామ్నాయం ఉందని, అదే అభివృద్ధి, సుపరిపాలన అందించే భాజపా అని పేర్కొన్నారు. ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్‌లకు జెండాలు వేర్వేరైనా వాటి అజెండా మాత్రం ఒక్కటేనని, అది అవినీతి, జవాబుదారీతనం లేకపోవడమేనని మోదీ ఆరోపించారు.
వివరాలు
కేరళ ప్రజలు భాజపాపై విశ్వాసం ఉంచాలి
ప్రస్తుతం కేరళకు ప్రజల అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే ప్రభుత్వం అవసరమని, ఆ బాధ్యతను భాజపా తీసుకుంటుందని ప్రధాని స్పష్టం చేశారు. కేరళ ప్రజలు భాజపాపై విశ్వాసం ఉంచి తమతో కలిసి నడవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శబరిమల ఆలయంలో బంగారు చోరీ ఘటనను ప్రస్తావించిన మోదీ, ఆ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిగేలా చూడటం 'మోదీ గ్యారెంటీ' అని హామీ ఇచ్చారు.