#ModiKaParivar : 'లాలూ' ఎఫెక్ట్.. సోషల్ మీడియాలో బీజేపీ 'మోదీ కా పరివార్' ప్రచారం
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కుటుంబం లేదని ఆదివారం అన్న మాటలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆదివారం పాట్నలో తేజస్వీ యాదవ్ చేపట్టిన 'జన్ విశ్వాస్ మహా ర్యాలీ'లోలాలూ ఈ వ్యాఖ్యలు చేశారు. లాలూ యాదవ్ ఆ మాటలు అన్న ఒకరోజు తర్వాత.. బీజేపీ అగ్రనాయకులు మోదీ మద్దుతుగా సోషల్ మీడియా వేదికగా కౌంటర్స్ ఇస్తున్నారు. ట్విట్టర్(ఎక్స్) హ్యాండిల్స్‌లో వారి పేరు పక్కన 'మోదీ కా పరివార్ (#ModiKaParivar) ' అని జత చేసి.. తామంతా మోదీ కుటుంబమే అన్న మెసేజ్‌ను ఇస్తున్నారు. అమిత్ షా, యూపీ సీఎం యోగి, నడ్డా లాంటి ముఖ్య నాయకులు తమ ప్రొఫైల్‌లో 'మోదీ కా పరివార్' అనే నినాదాన్ని చేర్చుకున్నారు.
140 కోట్లమంది నా కుటుంబ సభ్యులే: మోదీ
ప్రధాని మోదీ కూడా సోమవారం లాలూ ఆరోపణకు దీటుగా బదులిస్తూ, అవినీతి, బంధుప్రీతి, బుజ్జగింపు రాజకీయాల్లో ఇండియా కూటమి నేతలు మునిగితేలుతున్నట్లు పేర్కొన్నారు. ఆదిలాబాద్‌లో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ.. 140 కోట్ల మంది దేశప్రజలు నా కుటుంబమని, ఎవరూ లేని వారు కూడా మోదీకి చెందినవారన్నారు. ఇదిలా ఉంటే, లోక్‌సభ ఎన్నికల వేళ.. బీజేపీ ఇచ్చిన 'మోదీ కా పరివార్' నినాదం.. 2019 నాటి ఎన్నికల సంఘటనను గుర్తుకు తెలుస్తుంది. 2019 ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ మోదీని ఉద్దిశించి 'చౌకీదార్ చోర్ హై' అన్నారు. దానికి కౌంటర్‌గా బీజేపీ నేతలు "మై భీ చౌకీదార్ హూన్' అంటూ తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ మార్చారు.
ట్రెండింగ్‌లో #మోదీ కా పరివార్
ప్రధాని మోదీ మద్దతుదారులు, కేంద్రమంత్రులు, బీజేపీ అగ్రనేతలు సోషల్ మీడియాలో తమ ప్రొఫైల్‌లలో 'మోదీ కా పరివార్' అని రాయడంతో ఇది ట్రెండింగ్ లిస్టులో చేరిపోయింది. సంబిత్ పాత్ర, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అనురాగ్ ఠాకూర్, పీయూష్ గోయల్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వంటి చాలా మంది బీజేపీ నేతలు, దేశవ్యాప్తంగా ప్రధాని మోదీని ఇష్టపడే వ్యక్తులు తమ ఎక్స్-బయోలో 'మోదీ కా పరివార్'ను జత చేశారు. ఒకరకంగా చెప్పాలంటే.. మోదీని విమర్శించడానికి లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు.. ఇప్పుడు బీజేపీ కీలక అస్త్రంగా మారడం గమనార్హం.