 
                                                                                Montha Cyclone: మొంథా తుఫాను దెబ్బ.. వరంగల్‌లో వరద విపత్తు, జలదిగ్బంధంలో 45 కాలనీలు
ఈ వార్తాకథనం ఏంటి
మొంథా తుపాన్ ప్రభావంతో వరంగల్ జిల్లాలో కురిసిన భారీ వర్షాల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య ఏడు మందికి పెరిగింది. వర్షాలు,వరదలతో సంబంధం ఉన్న ఈ ఘటనల్లో.. ఎస్సార్ నగర్‌కు చెందిన వృద్ధుడు ఆడేపు కృష్ణమూర్తి వరదల్లో గల్లంతయ్యారు. కొండపర్తి గ్రామంలో ఇల్లు కూలిపోవడంతో వృద్ధురాలు సూరమ్మ మృతి చెందింది. హనుమకొండలోని టీవీ టవర్ కాలనీలో రిటైర్డ్ ఉద్యోగి పాక శ్రీనివాస్ ప్రాణాలు కోల్పోయారు. ఎల్కతుర్తి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన అప్పని నాగేంద్రం, బోళ్లమత్తడి వాగులో గల్లంతైన యువతి శ్రావ్య, మహబూబాబాద్ జిల్లా జంపన్నవాగులో మునిగిపోయిన సంపత్, శివనగర్‌లోని నేతాజీ స్కూల్ వద్ద మృతి చెందిన అనిల్ - ఇలా మొత్తం ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.
వివరాలు
పెరుగుతున్న మున్నేరు ఉద్ధృతి
అనిల్ మృతదేహం వరదనీటిలో కొట్టుకువచ్చింది. గీసుకొండకు చెందిన వ్యక్తిగా పోలీసులు ఆయనను గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. వరంగల్ నగరంలో కురిసిన తీవ్ర వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సుమారు 45 కాలనీలు వరద నీటిలో చిక్కుకున్నాయి. మున్నేరు వాగు ఉద్ధృతి పెరగడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. అనేక రహదారులపై నీరు చేరి రవాణా అంతరాయం ఏర్పడింది. ఇప్పటికీ అనేక కాలనీల్లో నీరు నిలిచే ఉంది.