సీబీఐ కేసుల డేటాను వెల్లడించిన కేంద్ర విజిలెన్స్ కమిషన్... 20ఏళ్లు గడిచినా పూర్తికాని అవినీతి కేసులు
దేశవ్యాప్తంగా వందలాది అవినీతి కేసులు దాదాపు 20 ఏళ్లకుపైగా అపరిష్కృతంగానే ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర విజిలెన్స్ కమిషన్ (CVC) నివేదిక విడుదల చేసింది. దేశవ్యాప్తంగా సీబీఐ దర్యాప్తు చేసిన అనివీతి కేసులు, కోర్టు విచారణకు సంబంధించి 6,841 అవినీతి కేసులు వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించింది. అయితే వీటిల్లో దాదాపుగా 300కిపైగా కేసులు 20 ఏళ్లకుపైగా విచారణలు కొనసాగుతూనే ఉన్నాయని పేర్కొంది. మరోవైపు దాదాపు 10 నుంచి 20 సంవత్సరాలుగా 2,039 కేసులలో ఇప్పటికీ విచారణ కొనసాగుతోంది. 5 నుంచి 10 ఏళ్లుగా సుమారు 2,324 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు నివేదిక స్పష్టం చేసింది. 3 నుంచి 5 ఏళ్లుగా 842 కేసుల విచారణ సాగుతున్నట్లు నివేదిక వివరించింది.
సిబ్బంది కొరత, అధిక పనిభారం లాంటి కారణాలతోనే కేసుల పెండింగ్
ఇక 1,323 కేసులు మూడేళ్ల కంటే తక్కువ కాలంలోనే అపరిష్కృతంగా ఉండటం గమనార్హం. అవే కాకుండా అవినీతి కేసులకు సంబంధించి 12,408 అప్పీళ్లు, రివిజన్లు సుప్రీంకోర్టు సహా పలు రాష్ట్రాల హైకోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి. అయితే 417 అప్పీళ్లు 20 సంవత్సరాల కిందవేనని పేర్కొంది.కేంద్ర దర్యాప్తు సంస్థ వద్ద 692 అవినీతి కేసులు దర్యాప్తు దశలోనే నిలిచిపోయినట్లు CVC వెల్లడించింది. ఐదేళ్లకుపైబడి 42 కేసులు అపరిష్కృతంగా ఉన్నాయని తెలిపింది.మామూలుగా అవినీతి కేసును సీబీఐ నమోదు చేస్తే ఏడాదిలోగా దర్యాప్తు పూర్తి చేయాల్సి ఉంటుంది. సిబ్బంది కొరత, సుదూర ప్రాంతాల్లోని సాక్షుల చిరుమానాల గుర్తింపు, అధిక పనిభారం లాంటివాటితో దర్యాప్తులు జాఫ్యం అవుతున్నట్లు కేంద్ర విజినెల్స్ కమిషన్ తమ నివేదిక ద్వారా బహిర్గతం చేసింది.