LOADING...
MUDA Scam: ముడా కేసులో మరో 92కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసిన ED.. మొత్తం జప్తు విలువ రూ.400 కోట్లు
ముడా కేసులో మరో 92కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసిన ED..

MUDA Scam: ముడా కేసులో మరో 92కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసిన ED.. మొత్తం జప్తు విలువ రూ.400 కోట్లు

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 10, 2025
03:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (MUDA) భూముల కేటాయింపులో చోటుచేసుకున్న భారీ కుంభకోణానికి సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) తన దర్యాప్తును వేగంగా కొనసాగిస్తోంది. ఈ వ్యవహారంలో భాగంగా,దాదాపు రూ.100కోట్ల మార్కెట్ విలువ ఉన్న 92ఆస్తులను ఈడీ తాత్కాలికంగా స్వాధీనం చేసుకుంది. ఇప్పటివరకు మొత్తం రూ.400 కోట్ల విలువైన ఆస్తులు ఈ కేసులో సీజ్ చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈడీ వెల్లడించిన సమాచారం ప్రకారం,స్వాధీనం చేసుకున్న ఆస్తులన్నీ సహకార సంఘాల పేరుతో నమోదయ్యాయని, వాస్తవానికి అవి MUDA అధికారులు సహా రాజకీయంగా ప్రభావశీలుల బినామీల పేరిట ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఏజెన్సీ అధికారికంగా పేర్కొన్న వివరాల ప్రకారం, సీజ్ చేసిన ఆస్తుల మార్కెట్ విలువ మొత్తం రూ.400 కోట్లకు సమానం.

వివరాలు 

 MUDA భూముల కేటాయింపు ప్రక్రియలో భారీగా అక్రమాలు 

ఈ దర్యాప్తు ప్రస్తుత కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సహా ఇతరులపై మైసూర్‌లో లోకాయుక్త పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా జరుగుతోంది. ఎఫ్‌ఐఆర్‌లో 1860 నాటి భారత శిక్షాస్మృతి (IPC)తో పాటు,1988 నాటి అవినీతి నిరోధక చట్టంలోని పలు విభాగాలు వర్తిస్తున్నాయి. ఈ దర్యాప్తులో MUDA భూముల కేటాయింపు ప్రక్రియలో భారీగా అక్రమాలు జరిగాయని ఈడీ గుర్తించింది. మాజీ MUDA కమిషనర్ జీటీ దినేష్ కుమార్ సహా పలు కీలక అధికారులపై అనర్హులైన వ్యక్తులకు, అర్హత లేని సంస్థలకు భూములను పరిహారంగా కేటాయించడంలో కీలక పాత్ర వహించినట్టు ఈడీ అధికార వర్గాలు తెలిపాయి. ఈ వ్యవహారానికి సంబంధించి జరిగిన అక్రమ లావాదేవీలకు సంబంధించిన పలు సాక్ష్యాలను కేంద్ర దర్యాప్తు సంస్థ సేకరించినట్లు సమాచారం.

వివరాలు 

విజయనగర్ ప్రాంతంలో మొత్తం 14 ప్లాట్ల కేటాయింపు 

కేసుకు మూలం మైసూర్ MUDA పరిధిలోని కేసరే గ్రామంలో ఉన్న 3.2 ఎకరాల భూమికి సంబంధించింది. ఈ భూమిని 2010లో మల్లికార్జున స్వామి అనే వ్యక్తి తన సోదరి పార్వతికి బహుమతిగా ఇచ్చారు. అనంతరం MUDA ఆ భూమిని సేకరించింది. భూమి సేకరణకు పరిహారం చెల్లించాలని కోరిన పార్వతికి, MUDA దక్షిణ మైసూర్‌లోని విజయనగర్ ప్రాంతంలో మొత్తం 14 ప్లాట్లను కేటాయించింది. ఈ ప్లాట్ల విలువ ఆమె భూమికి ఉన్న విలువను మించి ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అలాగే, నియమాలకు విరుద్ధంగా భూమి కేటాయింపులు జరిగాయని తీవ్ర విమర్శలు వ్యక్తం చేస్తున్నాయి. మొత్తం భూ కుంభకోణం విలువ రూ.3000 కోట్లు నుంచి రూ.4000 కోట్ల వరకు ఉండొచ్చని ప్రతిపక్ష నేతలు చెబుతున్నారు.