Mumbai Man suicide: నా చావుకు నా భార్యే కారణం.. కంపెనీ వెబ్‌సైట్‌లో సూసైడ్ నోట్
ఈ వార్తాకథనం ఏంటి
తన మరణానికి భార్యే కారణమంటూ ఓ వ్యక్తి ప్రాణాలు తీసుకున్న ఘటన సంచలనంగా మారింది.
ముంబైలోని ఓ హోటల్ గదిలో ఆయన బలవంతంగా ఆత్మహత్య చేసుకున్నారు. మరణానికి ముందు తన కంపెనీ వెబ్‌సైట్‌లో సూసైడ్ నోట్‌ను పోస్ట్ చేశారు.
కొన్ని రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
వివరాలు
ఆత్మహత్య చేసుకునే ముందు గదికి 'డూ నాట్ డిస్టర్బ్' బోర్డు
పోలీసుల వెల్లడించిన వివరాల ప్రకారం... మృతుడు నిశాంత్ త్రిపాఠి. ఇటీవల ముంబయిలోని ఓ హోటల్‌లో బస చేశారు.
ఆత్మహత్య చేసుకునే ముందు గదికి 'డూ నాట్ డిస్టర్బ్' బోర్డు ఉంచి, ఎవరూ అటువైపు రావొద్దని సంకేతం ఇచ్చారు.
అనేక గంటలు గడిచినా గదిలో నుంచి ఆయన బయటకు రాకపోవడంతో హోటల్ సిబ్బంది అనుమానంతో, మాస్టర్ కీతో తలుపులు తెరిచి చూశారు.
అప్పటికే నిశాంత్ మృతిచెందినట్లు తెలిసింది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు.
ఆత్మహత్యకు ముందు నిశాంత్ తన కంపెనీ వెబ్‌సైట్‌లో సూసైడ్ నోట్‌ను పోస్టు చేశారు.
అందులో తన భార్యపై ప్రేమను వ్యక్తం చేస్తూనే, ఆమె, ఆమె బంధువుల కారణంగా తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు.
వివరాలు
సూసైడ్ నోట్‌లో ఏముందంటే?
"ఈ లేఖను నువ్వు చదివే సమయానికి నేను ఈ లోకంలో లేను. మన మధ్య జరిగిన విషయాల కారణంగా నిన్ను ద్వేషించాలి. కానీ, నేను ప్రేమనే ఎంచుకుంటాను. ఇప్పటికీ, ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. నేను అనుభవించిన కష్టాల గురించి నా తల్లికి తెలుసు. దయచేసి మీరు ఆమెను కలవకండి. ఆమె ఇప్పటికే చాలా బాధలో ఉంది. నా తల్లిని ప్రశాంతంగా ఉండనివ్వండి", అంటూ లేఖలో వాపోయారు.
నిశాంత్ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో,నిశాంత్ భార్యపై కేసు నమోదు చేశారు.
నిశాంత్ తల్లి మహిళా హక్కుల కార్యకర్త.తన కుమారుడి మరణంతో తీవ్ర మనోవేదనకు గురైన ఆమె, సోషల్ మీడియా వేదికగా ఓ భావోద్వేగ పోస్ట్ పెట్టారు.
వివరాలు
ఇలాంటి సంఘటనలు పెరుగుతున్నాయి…
"ఇక నా జీవితంలో ఆశయమే లేదు. ఇప్పుడు నేను ఒక జీవచ్ఛవాన్ని. నా బిడ్డ నన్ను వదిలేసి వెళ్లిపోయాడు."
ఇటీవల ఇటువంటి ఘటనలు వరుసగా జరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
కొంత కాలం క్రితం బెంగళూరులో అతుల్ సుభాష్ అనే యువకుడు భార్య వేధింపులు తట్టుకోలేక 40 పేజీల సూసైడ్ లేఖ రాసి, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, తన కార్యాలయ సిబ్బంది, కుటుంబ సభ్యులకు మెయిల్ పంపించి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇటీవలే ముంబయిలోని ప్రముఖ ఐటీ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్న 30 ఏళ్ల మానవ్ శర్మ కూడా తన మరణానికి భార్యే కారణమని ఒక సూసైడ్ నోట్ రాసి, ఫిబ్రవరి 24న తనువు చాలించారు.
ఈ వరుస ఘటనలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.