Mumbai: గేట్‌వే ఆఫ్ ఇండియా సమీపంలో కువైట్ బోటు కలకలం..ముంబై పోలీసుల అదుపులో ముగ్గురు
ముంబై పోలీసుల పెట్రోలింగ్ బృందం మంగళవారం సాయంత్రం గేట్‌వే ఆఫ్ ఇండియా సమీపంలో అరేబియా సముద్రంలో కువైట్ నుండి వస్తున్న పడవను అడ్డగించింది. ఆ బోటులో ముగ్గురు తమిళనాడుకు చెందిన మత్స్యకారులున్నారు. వార్తా సంస్థ PTI ప్రకారం, పడవలో ఎలాంటి ఆయుధాలు లభ్యం కాలేదు. ఆంటోనీ, నిడిసో డిటో, విజయ్ ఆంటోనీగా గుర్తించబడిన ముగ్గురు వ్యక్తులు తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాకు చెందినవారు. ప్రస్తుతం వారు కొలాబా పోలీస్ స్టేషన్‌లో పోలీసుల అదుపులో ఉన్నారు. ఇంకా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదు. ప్రస్తుతం,దొంగిలించబడిన కువైట్ బోట్ గేట్‌వే ఆఫ్ ఇండియా వద్ద సురక్షితంగా డాక్ చేయబడిందని, అరేబియా సముద్రం ద్వారా భారత జలాల్లోకి ప్రవేశించడానికి సంబంధించిన పరిస్థితులను అధికారులు పరిశీలిస్తున్నట్లు అధికారి తెలిపారు.
యజమాని నుండి పడవను దొంగలించిన ఖైదీలు
ఖైదీల ప్రకారం,ముగ్గురూ ఒక ఫిషింగ్ కంపెనీలో పనిచేస్తున్నారు. వారి యజమాని వారిని హింసిస్తున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా, జీతం చెల్లించకుండా ,కఠినంగా వ్యవహరించేవాడని, అందుకే వారు తమ యజమాని నుండి పడవను దొంగిలించామని పేర్కొన్నారు. తమ పాస్‌పోర్టులు జప్తు చెయ్యడంతో , దీంతో తమ యజమాని నౌకను దొంగిలించడం తప్ప మరో మార్గం లేకుండా పోయిందని మత్స్యకారులు తెలిపారు. సముద్ర గస్తీని తప్పించుకొని కువైట్ బోట్ గేట్‌వే ఆఫ్ ఇండియాకు ఎలా చేరిందనే చర్చనీయాంశంగా మారింది.
అనుమానాస్పద పడవ.. 26/11 ఉగ్రదాడి
కోల్బా పోలీస్ స్టేషన్‌లోని సీనియర్ పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. బీచ్‌కు కొంచెం దూరంలో అరేబియా సముద్రంలో కదలికలు కనిపించడంతో భారత జలాల్లోకి అనుమానాస్పద బోట్ ప్రవేశించినట్లుగా వాచ్ టవర్ పేర్కొంది. దీంతో ముంబై పోలీసుల పెట్రోలింగ్ బృందం ఆ పడవను అడ్డగించి.. ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. వీరి ముగ్గురిపై కేసు నమోదు చేసి.. విచారణ ప్రారంభించారు. గేట్‌వే ఆఫ్ ఇండియా సమీపంలో అనుమానాస్పద పడవ కనిపించడం 26/11 ఉగ్రదాడిని గుర్తుకు తెచ్చింది. నవంబర్ 2008లో ముంబైలో ఉగ్రదాడులకు పాల్పడిన పది మంది పాకిస్తానీ ఉగ్రవాదులు సముద్ర మార్గం నుంచి రావడం గమనార్హం.