LOADING...
Mumbai: ముంబైని అతలాకుతలం చేస్తున్న వర్షాలు.. యెల్లో,ఆరెంజ్​,రెడ్​ అలర్ట్​ జారీ చేసిన ఐఎండీ 
ముంబైని అతలాకుతలం చేస్తున్న వర్షాలు.. అలర్ట్​ జారీ చేసిన ఐఎండీ

Mumbai: ముంబైని అతలాకుతలం చేస్తున్న వర్షాలు.. యెల్లో,ఆరెంజ్​,రెడ్​ అలర్ట్​ జారీ చేసిన ఐఎండీ 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 18, 2025
11:46 am

ఈ వార్తాకథనం ఏంటి

ముంబై నగరం వరుణుడి దాడితో అల్లకల్లోలంగా మారింది. ఎడతెరపి వర్షాలతో అనేక ప్రాంతాలు జలమయం కాగా, సాధారణ జీవన విధానంలో అంతరాయం ఏర్పడింది. బోరివలి, థానే, కళ్యాణ్, ములుండ్, పవాయ్, శాంటాక్రూజ్, చెంబూర్, వర్లీ, నవీ ముంబై, కొలాబా వంటి ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వరుసగా రెండో రోజు ముంబైకు "ఆరెంజ్ అలర్ట్" జారీ చేసింది. ఐఎండీ సూచనల ప్రకారం "ఆరెంజ్ అలర్ట్" మూడవ స్థాయి హెచ్చరిక. ఇది భారీ వర్షాలు కురిసే అవకాశాన్ని తెలియజేస్తుంది. ముంబైతో పాటు మహారాష్ట్రలోని పలు జిల్లాలకు "యెల్లో", "ఆరెంజ్" అలర్ట్‌లు ప్రకటించగా, పూణే జిల్లాకు ప్రత్యేకంగా "రెడ్ అలర్ట్" జారీ చేశారు.

వివరాలు 

భారీ వర్షాలతో ముంబై విలవిల.. 

ఆదివారం వర్షం కొంత తగ్గినా, ఈరోజు ముంబైలో గంటకు 5 నుంచి 15 మిల్లీమీటర్ల మేర తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని, మేఘావృత వాతావరణం కొనసాగి ఈదురు గాలులు వీచవచ్చని ఐఎండీ అంచనా వేసింది. గత శుక్రవారం కురిసిన భారీ వర్షాలతో ముంబైలో పరిస్థితి విషమించగా, ఐఎండీ వెంటనే "ఆరెంజ్ అలర్ట్" ప్రకటించింది. శనివారం తెల్లవారుజామున 1 గంట నుంచి 4 గంటల మధ్య పశ్చిమ, తూర్పు శివార్లలో కుండపోత వర్షాలు కురిశాయి. దీనికి అనుగుణంగా ముంబైకి "రెడ్ అలర్ట్" ఇచ్చారు. అనేక చోట్ల 200 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది.

వివరాలు 

వర్షాల కారణంగా మునిగిన లోతట్టు ప్రాంతాలు

వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు మునిగిపోయి, లోకల్ రైళ్ల రాకపోకలు దాదాపు నిలిచిపోయాయి. శనివారం విఖ్రోలి పార్క్‌సైట్ వద్ద కొండచరియలు విరిగిపడి ఇద్దరు మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు. అలాగే సెంట్రల్, వెస్ట్రన్ రైల్వే మార్గాల్లో ట్రాక్‌లపై నీరు నిల్వడంతో రైల్వే సేవలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆదివారం ముంబై, థానే, రాయ్‌గడ్, పాల్ఘడ్ జిల్లాలకు ఐఎండీ "ఆరెంజ్ అలర్ట్" జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో గంటకు 40-50 కి.మీ. వేగంతో, కొన్ని చోట్ల 60 కి.మీ. వేగంతో గాలులు వీస్తూ, భారీ వర్షాలు పడే అవకాశముందని అంచనా వేసింది.

వివరాలు 

ఈ ప్రాంతాలలో అలర్ట్స్.. 

నాసిక్, ఖండాలా, భీమశంకర్ రిజర్వ్, పుణె, మహాబలేశ్వర్, కొల్హాపూర్, సతారా, జల్గావ్, మాలేగావ్, ధూలే, చాలిస్‌గావ్, ఇగత్‌పురి, నందుర్బార్, కరాడ్, సాంగ్లి, తాస్‌గావ్, బారామతి, అహ్మద్‌నగర్, శ్రీరాంపూర్, షిర్డీ, జేయుర్, పంఢర్‌పూర్, సోలాపూర్, ఉస్మానాబాద్, బీడ్, పర్భణి, ఉద్గిర్, చంద్రపూర్, భ్రహ్మాపురి, గడ్చిరోలి జిల్లాలకు "యెల్లో అలర్ట్" జారీ అయింది. అలాగే ముంబైతో పాటు దహను, విక్రమ్‌గడ్, అలిబాగ్, రాయ్‌గడ్ రిజర్వ్, శ్రీవర్ధన్, హర్నై, దాపోలి, రత్నగిరి, విజయ్‌దుర్గ్, దేవ్‌గడ్, మిత్‌భవ్ బీచ్, సింధుదుర్గ్, మాల్వన్, శ్రీరామ్‌వాడి, వెంగూర్ల, సావంత్‌వాడి ప్రాంతాలకు "ఆరెంజ్ అలర్ట్" అమల్లో ఉంది.

వివరాలు 

ముంబైలో ఆగస్ట్ 20 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు 

ఐఎండీ అంచనాల ప్రకారం ముంబైలో ఆగస్ట్ 20 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఆ తర్వాత ఆగస్ట్ 23 వరకు తేలికపాటి వర్షాలు కొనసాగవచ్చు. మధ్య మహారాష్ట్రలో అహిల్యానగర్, ధూలే, జల్గావ్, నందుర్బార్, పుణె, సతారా, సాంగ్లి, సోలాపూర్, కొల్హాపూర్, నాసిక్ జిల్లాలకు ఆగస్ట్ 19 వరకు "రెడ్ అలర్ట్" అమల్లో ఉంది. ఈ కాలంలో ఉరుములు,మెరుపులు, బలమైన గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. మరాఠ్వాడా ప్రాంతంలో బీడ్,ఛత్రపతి శంభాజీనగర్, ధారాశివ్, హింగోలి, జల్నా, లాతూర్, నాందేడ్, పర్భణి జిల్లాలకు నేడు "ఆరెంజ్ అలర్ట్", రేపు "యెల్లో అలర్ట్" అమల్లో ఉంటుంది. ఈ జిల్లాల్లో కూడా వర్షాలు,ఉరుములు,మెరుపులు సంభవించే అవకాశముందని ఐఎండీ వెల్లడించింది.

వివరాలు 

 కొంకణ్, గోవా, విదర్భ ప్రాంతాలకు కూడా నేడు, రేపు "రెడ్ అలర్ట్" 

గుజరాత్, సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాలకు నేడు "ఆరెంజ్ అలర్ట్" ప్రకటించగా, ఆగస్ట్ 20 వరకు "రెడ్ అలర్ట్" జారీ అయింది. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులు, బలమైన ఉపరితల గాలులు వీస్తాయని సూచించారు. అలాగే కొంకణ్, గోవా, విదర్భ ప్రాంతాలకు కూడా నేడు, రేపు "రెడ్ అలర్ట్" ప్రకటించారు. ఆగస్ట్ 24 వరకు ఈ ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు, బలమైన గాలులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.