Page Loader
Bombay High Court: ప్రజలను వేధించకూడదు,చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు.. EDకి రూ.లక్ష జరిమానా విధించిన హైకోర్టు
EDకి రూ.లక్ష జరిమానా విధించిన హైకోర్టు

Bombay High Court: ప్రజలను వేధించకూడదు,చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు.. EDకి రూ.లక్ష జరిమానా విధించిన హైకోర్టు

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 22, 2025
09:18 am

ఈ వార్తాకథనం ఏంటి

బాంబే హైకోర్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక వ్యక్తిపై అనవసరంగా మనీలాండరింగ్ కేసును నమోదు చేసినందుకు ఈడీపై ఘాటుగా స్పందిస్తూ లక్ష రూపాయల జరిమానా విధించింది. స్పష్టమైన కారణం లేకుండా రియల్ ఎస్టేట్ డెవలపర్‌పై మనీలాండరింగ్ దర్యాప్తును చేపట్టిన ఈడీపై చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. కేంద్ర సంస్థలు చట్ట పరిధిలో మాత్రమే పని చేయాలని, పౌరులను అనవసరంగా వేధించడం తగదని హైకోర్టు హెచ్చరించింది. చట్ట అమలు సంస్థలకు సరిఅయిన సందేశం పంపాల్సిన అవసరం ఉందని జస్టిస్ మిలింద్ జాదవ్ నేతృత్వంలోని సింగిల్ బెంచ్ అభిప్రాయపడింది.

వివరాలు 

విలే పార్లే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు 

వివరాల్లోకి వెళితే, రాకేష్ జైన్ అనే రియల్ ఎస్టేట్ డెవలపర్‌పై నిబంధనల ఉల్లంఘన, మోసం ఆరోపణలతో ఒక ఆస్తి కొనుగోలుదారు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు విలే పార్లే పోలీస్ స్టేషన్‌లో నమోదైంది. దీనిపై ఆధారంగా ఈడీ రాకేష్ జైన్‌పై మనీలాండరింగ్ కేసును నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. ఈ కేసు 2014 ఆగస్టులో మొదలైంది. ఆ సమయంలో ఈడీ ప్రత్యేక కోర్టులో ప్రాసిక్యూషన్ దాఖలు చేయగా, కోర్టు నోటీసు జారీ చేసింది. అయితే, ఈ కేసు సంబంధించి మంగళవారం (జనవరి 21) బాంబే హైకోర్టు రాకేష్ జైన్‌పై ప్రత్యేక కోర్టు జారీ చేసిన నోటీసును రద్దు చేసింది.

వివరాలు 

ఈడీ చర్యలు దురుద్దేశంతో జరిగాయి

జస్టిస్ జాదవ్ పేర్కొన్నట్లు, ఈ కేసు మనీలాండరింగ్ నిరోధక చట్టం అమలు పేరుతో వేధింపులుగా కనిపిస్తోందన్నారు. ఈడీ చర్యలు దురుద్దేశంతో జరిగాయని ఇది స్పష్టమని హైకోర్టు తేల్చి చెప్పింది. కేంద్ర సంస్థలు చట్ట పరిధిని దాటి వ్యవహరించడం తగదని, ఇలాంటి చర్యలతో పౌరులను వేధించడం కఠినంగా శిక్షార్హమని హైకోర్టు స్పష్టం చేసింది. చట్టాన్ని అమలు చేసే సంస్థలు తమ అధికారాలను దుర్వినియోగం చేయకుండా నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఉందని హైకోర్టు తేల్చి చెప్పింది.