LOADING...
Delhi New CM: దిల్లీ నూతన సీఎం ఎంపికపై అమిత్‌ షాతో నడ్డా కీలక భేటీ 
దిల్లీ నూతన సీఎం ఎంపికపై అమిత్‌ షాతో నడ్డా కీలక భేటీ

Delhi New CM: దిల్లీ నూతన సీఎం ఎంపికపై అమిత్‌ షాతో నడ్డా కీలక భేటీ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 09, 2025
05:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ.. ఇప్పుడు కొత్త ముఖ్యమంత్రి ఎంపికపై ముమ్మర కసరత్తు చేపట్టింది. ఇందులో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా దిల్లీలో భేటీ అయ్యారు. నిన్న జరిగిన బీజేపీ విజయోత్సవ వేడుకల అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు కీలక నేతలు సీఎం ఎంపికపై చర్చించారు. తాజా భేటీ ఈ అంశానికి మరింత ప్రాధాన్యం కల్పించింది. ముఖ్యమంత్రి ఎంపికలో అనేక సమీకరణాలను పరిగణలోకి తీసుకుంటూ బీజేపీ వ్యూహాత్మకంగా సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఒడిశా రాష్ట్రాల్లో అనుసరించిన వ్యూహాన్ని దిల్లీలో కూడా అమలు చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Details

నూతన సీఎం ఎవరంటే?

దిల్లీ ముఖ్యమంత్రి పదవికి సంబంధించి పలు పేర్లు తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఓడించిన జాట్‌ వర్గానికి చెందిన నేత పర్వేశ్‌ వర్మ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అంతేగాక సతీశ్‌ ఉపాధ్యాయ్‌, విజయేందర్‌ గుప్తా, ఆశిష్‌ సూద్‌, పవన్‌ శర్మ వంటి నేతల పేర్లు కూడా పోటీలో ఉన్నాయి. అయితే భాజపా గతంలో పెద్దగా పరిచయం లేని నేతలకు సీఎం పదవి అప్పగించిన సందర్భాలు ఉండటంతో, ఈసారి ఎవరి ఎంపిక ఖరారవుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. పూర్వాంచల్‌ వర్గానికి చెందిన ఎమ్మెల్యే, సిక్కు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు లేదా మహిళా నేతను కూడా ముఖ్యమంత్రి పదవికి పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉందని బీజేపీ నేతలు పేర్కొంటున్నారు.

Details

నూతన వ్యూహాన్ని అమలు చేసే దిశగా బీజేపీ

గత అనుభవాలను పరిశీలిస్తే, 2023 మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఒడిశా అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీ ముఖ్యమంత్రి ఎంపికలో ఊహించని నిర్ణయాలు తీసుకుంది. మధ్యప్రదేశ్‌లో మోహన్‌ యాదవ్‌, రాజస్థాన్‌లో భజన్‌లాల్‌ శర్మ, ఒడిశాలో మోహన్‌ చరణ్‌ మాఝీలను ఎంపిక చేసి, రాజకీయ విశ్లేషకులను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ నేపథ్యంలో దిల్లీ సీఎం ఎంపిక విషయంలోనూ బీజేపీ కొత్త వ్యూహాన్ని అమలు చేసే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Details

ప్రమాణస్వీకారం ఎప్పుడంటే?

బీజేపీ దిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ్ ప్రకారం, ముఖ్యమంత్రి ఎంపికపై కేంద్ర నాయకత్వమే తుది నిర్ణయం తీసుకుంటుంది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలందరూ తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించగలుగుతారని ఆయన అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నందున, ఆయన తిరిగి వచ్చిన తర్వాతే దిల్లీ కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం జరుగుతుందని బీజేపీ వర్గాలు వెల్లడించాయి.