Nadendla Manohar: రైతు సేవా కేంద్రాలు, రైస్‌మిల్లుల మధ్య ధాన్యం తేమ శాతంలో తేడా వస్తే చర్యలు: నాదెండ్ల మనోహర్
ఈ వార్తాకథనం ఏంటి
రైతు సేవా కేంద్రాలు,రైస్‌మిల్లుల మధ్య ధాన్యం తేమ శాతంలో వ్యత్యాసం వస్తే తగిన చర్యలు తీసుకుంటామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.
మంగళవారం విజయవాడలోని పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో ఆయన రైస్‌మిల్లర్లతో సమావేశం నిర్వహించారు.
'ఖరీఫ్ సీజన్‌లో ఇప్పటివరకు 5.21 లక్షల మంది రైతుల నుండి 32 లక్షల టన్నుల ధాన్యం సేకరించాం. ఈ ధాన్యం కోసం రూ.7,522 కోట్లు చెల్లించాం, ఇందులో 24 గంటల్లోనే రూ.7,508 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశాం. ధాన్యం సేకరణ ప్రక్రియలో 30 వేల లారీలు, 37 వేల మంది హమాలీలు పాల్గొన్నారు. తొలిసారిగా వాట్సాప్ ద్వారా ఈ ప్రక్రియ నిర్వహించడం జరిగింది' అని మంత్రి వివరించారు.
వివరాలు
ఏఐ ఆధారిత సీసీ కెమెరాలతో భద్రత పెంపు
రాష్ట్రంలోని వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ, రవాణా, భద్రతను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో ప్రైవేటు గోదాముల వద్ద ఏఐ ఆధారిత సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి మనోహర్ తెలిపారు.
ఈ సందర్భంగా మంగళవారం ప్రైవేటు గోదాముల నిర్వాహకులతో ఆయన సమావేశమయ్యారు.
93 లక్షల గ్యాస్ సిలిండర్ల పంపిణీ - రూ.714.57 కోట్లు లబ్ధిదారులకు జమ
దీపం 2.0 పథకం కింద ఇప్పటివరకు 93 లక్షల ఎల్‌పీజీ సిలిండర్లు పంపిణీ చేసినట్లు మంత్రి మనోహర్ ప్రకటించారు.
లబ్ధిదారుల ఖాతాల్లో మొత్తం రూ.714.57 కోట్లు జమ చేశామని తెలిపారు.ఎల్‌పీజీ డీలర్ల సమావేశంలో మాట్లాడిన ఆయన,ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తిచేయాలని,గ్యాస్ డెలివరీ చేసే వ్యక్తులు లబ్ధిదారుల నుంచి అదనపు చెల్లింపులు తీసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.