Page Loader
nadendla manohar: రేషన్‌ డోర్‌ డెలివరీ వాహనాల కొనుగోలులో భారీ కుంభకోణం: పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ 
రేషన్‌ డోర్‌ డెలివరీ వాహనాల కొనుగోలులో భారీ కుంభకోణం

nadendla manohar: రేషన్‌ డోర్‌ డెలివరీ వాహనాల కొనుగోలులో భారీ కుంభకోణం: పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 02, 2025
08:40 am

ఈ వార్తాకథనం ఏంటి

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఎండీయూ (రేషన్‌ డోర్‌ డెలివరీ)వాహనాల కొనుగోలులో భారీ కుంభకోణం చోటుచేసుకుందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఆయా సంస్థల ప్రమాణాలకు తగిన విధంగా ఈ వాహనాలు లేవని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన రేషన్‌ డోర్‌ డెలివరీ వ్యవస్థ కారణంగా రాష్ట్రంలోని పేదలకు కేటాయించిన బియ్యం ఎక్కడికి వెళ్తోంది, ఎంత మేరకు చేరుతోంది అన్న లెక్కలు తెలియని పరిస్థితి ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. రేషన్‌ మాఫియా వ్యాప్తికి ఇదే కారణమని మంత్రి మనోహర్‌ విమర్శించారు.

వివరాలు 

కొత్త రేషన్ కార్డులు - ఏటీఎం తరహాలో 

అక్రమాలు జరుగుతున్న విషయం తెలుసినా,ప్రభుత్వ ఒప్పందాల కారణంగా చర్యలు తీసుకోలేని దుస్థితి నెలకొన్నదని, వైకాపా హయాంలో కుదుర్చుకున్న ఒప్పందాల వల్ల ప్రస్తుతం ఒక్కో వాహనానికి నెలకు రూ.27,000 చెల్లించాల్సి వస్తోందని ఆయన ధ్వజమెత్తారు. మంగళవారం సచివాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, ఏప్రిల్‌ చివరికల్లా రేషన్‌ కార్డులకు ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. ఆ తరువాత క్యూఆర్‌ కోడ్‌తో కూడిన ఏటీఎం తరహా రేషన్‌ కార్డులు అందజేస్తామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో రేషన్‌ కార్డుపై అప్పటి సీఎం జగన్‌ ఫొటో వేయించారని,అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం అందించే రేషన్‌ కార్డులపై ఏ ముఖ్యమంత్రి లేదా ఇతర నేతల ఫొటోలు ఉండబోవని వెల్లడించారు.

వివరాలు 

ఖరీఫ్‌లో రూ.8,279 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు 

పొరుగుసేవల ఉద్యోగులకు రేషన్‌ కార్డుల వ్యవహారంపై మంత్రివర్గ సమావేశంలో చర్చించామని, దీనిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. 2023-24 ఖరీఫ్‌లో వైకాపా ప్రభుత్వం కేవలం 29 లక్షల టన్నుల ధాన్యం మాత్రమే సేకరించగా, 2024-25 ఖరీఫ్‌లో కూటమి ప్రభుత్వ హయాంలో 5.60 లక్షల మంది రైతుల నుంచి 35.93 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని మంత్రి వివరించారు. ఇంత భారీ స్థాయిలో ధాన్యం సేకరణ జరిపి, ధాన్యం అమ్మిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో రూ.8,279 కోట్లు జమ చేశామని తెలిపారు. రబీలో 10 లక్షల టన్నుల సేకరణ లక్ష్యంగా నిర్ణయించామని, ఏప్రిల్‌ 1 నుంచి కొనుగోలు ప్రక్రియ ప్రారంభించామని తెలిపారు.

వివరాలు 

రెండో ఉచిత గ్యాస్ సిలిండర్‌ బుకింగ్‌ ప్రారంభం 

దీపం-2 పథకం కింద రెండో ఉచిత సిలిండర్‌కు బుకింగ్‌ ప్రారంభమైనట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. మార్చి 31 నాటికి రాష్ట్రంలో 99,03,000 మందికి ఉచిత సిలిండర్‌ అందించామని, దీనికోసం రూ.760 కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామని వెల్లడించారు. కొత్తగా 2 లక్షల కొత్త గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేశామని, రెండో సిలిండర్ లబ్ధిదారుల సంఖ్య కోటికి చేరాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. జూన్‌ నుంచి మధ్యాహ్న భోజనం మరియు వసతి గృహ విద్యార్థులకు సన్నబియ్యం పంపిణీ చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు.