Nagababu: ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా నాగబాబు!
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోమవారం అసెంబ్లీలోని సీఎం ఛాంబర్‌లో సమావేశమయ్యారు.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు సహా వివిధ అంశాలపై గంట పాటు ఇద్దరూ చర్చించారు.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు, అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన విషయాలపై కొద్దిసేపు చర్చ జరిగింది. జరగనున్న ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి నాగబాబుకు కేటాయించినట్లు నిర్ణయించారు.
శాసనసభలో సీఎం చంద్రబాబు తన స్థానంలో కూర్చొని ఉండగా, పవన్ కల్యాణ్ ఆయన వద్దకు వెళ్లి పలకరించారు.
ఈ సందర్భంగా ఇద్దరూ పక్కపక్కనే కూర్చొని కొద్దిసేపు చర్చించారు. అనంతరం కలిసి సీఎం ఛాంబర్‌కు వెళ్లారు.
వివరాలు
తల్లికి వందనం, అన్నదాతా సుఖీభవ పథకాలపై చర్చ
రాష్ట్ర బడ్జెట్‌లో వివిధ శాఖలకు కేటాయింపులపై పవన్ కల్యాణ్ తన అభిప్రాయాలను వ్యక్తపరిచారు.
అభివృద్ధి,సంక్షేమ పథకాల కోసం సమతూకంగా నిధులు కేటాయించారని పేర్కొన్నారు.
మే నెల నుండి ప్రారంభించనున్న తల్లికి వందనం, అన్నదాతా సుఖీభవ పథకాలపై కూడా ఇద్దరి మధ్య చర్చ జరిగింది.
పంచాయతీరాజ్ శాఖ ద్వారా రహదారుల అభివృద్ధి పనులు పూర్తయిన విషయాన్ని డిప్యూటీ సీఎం వివరించారు.
తాగునీటి సరఫరాపై అధిక దృష్టి సారించినట్లు తెలిపారు.
ఉపాధి హామీ ద్వారా రాష్ట్రానికి ఎక్కువ నిధులు తీసుకురావడంతో పాటు పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టాల్సిన అవసరంపై చర్చించారు.
వివరాలు
రాష్ట్ర అభివృద్ధికి ఉపాధి, ఉద్యోగ కల్పన ప్రధాన లక్ష్యం
రాష్ట్రంలో ఉద్యోగ కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని పవన్ కల్యాణ్ సూచించారు.
గత ప్రభుత్వ హయాంలో పెట్టుబడిదారులు రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోయిన కారణంగా, ఇప్పుడు వారిని తిరిగి ఆకర్షించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు చంద్రబాబు వివరించారు.
పెట్టుబడిదారులతో చర్చలు జరుపుతూ, రాష్ట్ర అభివృద్ధికి ఉపాధి, ఉద్యోగ కల్పన ప్రధాన లక్ష్యంగా కొనసాగుతున్నట్లు తెలిపారు.