Nagarjuna Sagar : తెలంగాణలో ఎన్నికల వేళ ఏపికి సాగర్ నుంచి నీటి విడుదల
తెలంగాణలో ఓ వైపు పోలింగ్ జరుగుతుండగా, మరోవైపు నాగార్జున సాగర్ నుంచి ఆంధ్రప్రదేశ్ అధికారులు నీటిని విడుదల చేసి దుమారం సృష్టించారు. ఈ మేరకు కుడి కాలువ నుంచి 2 వేల క్యూసెక్కుల నీటిని ఆంధ్రప్రదేశ్ అధికారులు విడుదల చేశారు. అంతకుముందే ఏపీ, తెలంగాణ పోలీసుల్ని నాగార్జున సాగర్ దగ్గర పోటా పోటీగా మోహరించారు. అయితే ఎన్నికల సమయంలో ఇదో పెద్ద డ్రామా అని, రాజకీయంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ వద్ద బుధవారం నుంచి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.కుడి కాలువకు నీటిని ఒంగోలు చీఫ్ ఇంజనీర్ ఆధ్వర్యంలో 2వేల క్యూసెక్కుల నీళ్లను విడుదలయ్యాయి.
సాగర్ వద్ద డ్రామా అంటూ మండిపడ్డ సీపీఐ
ఏపీ ప్రజల తాగునీటి అవసరాల కోసమే నాగార్జున సాగర్ నీటిని విడుదల చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ప్రకటించారు. దీంతో సాగర్‌లో ఉద్రిక్త పరిస్థితులు రాజకీయంగా కలకలం సృష్టించింది. ఈ అంశంపై స్పందించిన సీపీఐ నేతలు, తెలుగు ప్రజానీకానికి ద్రోహం చేసే పద్దతుల్లోనే అటు తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్, బీజేపీ కలిసి ఆడే డ్రామా అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరిగే సమయంలోనే తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు కుట్రలు, కుతంత్రాలకు తెరలేపుతున్నారన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో కలిసి బీజేపీ డ్రామాలు ఆడుతోందని, ఈ మేరకు తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.