NagarjunaSagar: సాగర్ వివాదంపై కేంద్రం ఆరా..ఏపీ సర్కారుకు కృష్ణా బోర్డు కీలక ఆదేశాలు
నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ డ్యామ్ వివాదంపై కేంద్ర ప్రభుత్వం ఆరా తీసింది.ఈ మేరకు ఏపీ, తెలంగాణ పోలీసులు ప్రాజెక్టు వద్ద మోహరించడంతో ఉద్రిక్త వాతావరణం రేగింది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు కుడి కాల్వకు తక్షణమే నీటి విడుదలను ఆపేయాలని కృష్ణ రివర్ మేనేజ్ మెంట్ బోర్డు (KRMB) ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు ఇరువర్గాల మధ్య వివాదాన్ని తెరదించాలని సూచించింది. అయితే సాగునీరు కావాలని ఏపీ తమను కోరలేదని, ఏపీకి 15 టీఎంసీల నీటి విడుదలకు ఒప్పందం జరిగిందని, నవంబర్ 30 వరకు అడగకుండా నీటిని ఎలా విడుదల చేస్తారని బోర్డు నిలదీసింది. అక్టోబర్10 నుంచి 20వరకు 5 టీఎంసీలు, జనవరి 8 నుంచి 18 వరకు 5 టీఎంసీలతో పాటు
మూడు దశల్లో నీటి పంపకాలు
ఏప్రిల్ 8 నుంచి 24 వరకు 5 టీఎంసీలు వాడుకునేలా ఇరు రాష్ట్రాలు ఒప్పందం ఖరారు చేసుకున్నాయి. అక్టోబర్ కోసం అడిగిన 5 టీఎంసీల్లో ఇప్పటికే 5.01 టీఎంసీలు విడుదల చేసినట్లు బోర్డు స్పష్టం చేసింది. వచ్చే ఏడాది జనవరి, ఏప్రిల్'లో నీటిని విడుదల చేయాల్సి ఉందని బోర్డు వెల్లడించింది. ఈ మూడు దశల్లో నీటిని విడుదల చేయాలని ఆదేశించింది. మరోవైపు తాజా వివాదంతో నీటిపారుదల అధికారులతో ఇరు రాష్ట్రాల సీఎస్'లు భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఏపీ, తెలంగాణ మధ్య నెలకొన్న నాగార్జున సాగర్ డ్యామ్ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించాలని తెలంగాణ నీటిపారుదల శాఖ కోరుతోంది. ఈ మేరకు కేంద్ర అధికారులను, కృష్ణ రివర్ బోర్డు మేనేజ్ మెంట్ అధికారులకు విజ్ఞప్తులు చేసింది.