Dharani: తెలంగాణలో ధరణి పోర్టల్‌కు భూమాతగా నామకరణం
తెలంగాణ రాష్ట్రంలో సాగు భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ల సేవలకు సంబంధించిన 'ధరణి' పోర్టల్ పేరును 'భూమాత'గా మార్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆదివారం, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో జరిగిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆమోదం తెలిపారని సమాచారం. కాంగ్రెస్ పార్టీ గత శాసనసభ ఎన్నికల సమయంలో ధరణి పోర్టల్‌పై విమర్శలు, అవినీతి ఆరోపణలు చేసింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పోర్టల్‌ను రద్దు చేయడం లేదా పేరును మార్చడం గురించి పలుమార్లు చర్చించింది. ముఖ్యంగా 'భూమాత' పేరును మారుస్తామని ముఖ్యమంత్రి పలు సమావేశాలలో స్పష్టం చేశారు.
2020లో ధరణి పోర్టల్ అందుబాటులోకి
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత 2017 వరకు భూ నిర్వహణ మా భూమి (వెబ్ ల్యాండ్) పోర్టల్‌లో జరుగుతుండగా, 2017-18 మధ్య భూ దస్త్రాల ప్రక్షాళన (ఎల్‌ఆర్‌యూపీ) చేపట్టింది. భూ దస్త్రాలను రెవెన్యూ శాఖలో నమోదు చేసి, 2020 అక్టోబరులో ధరణి పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చారు. ధరణిలో 33 రకాల సాఫ్ట్‌వేర్ మాడ్యూళ్లను ఏర్పాటు చేసి, భూ సమస్యలున్న రైతులు వాటిని ఉపయోగించి దరఖాస్తు చేసుకునే విధానం అమలు చేశారు. ధరణి పోర్టల్‌లోని వివిధ మాడ్యూళ్లపై అవగాహన లోపం కారణంగా రైతులు మళ్లీ మళ్లీ ఖర్చు చేసి, సరిగా పరిష్కారం పొందలేకపోయారు. దీంతో ప్రభుత్వం ధరణి పోర్టల్ పేరును 'భూమాత' మార్చి, మాడ్యూళ్ల సంఖ్యను 14కు తగ్గించాలని నిర్ణయించింది.