ప్రాంతీయ ర్యాపిడ్ రైలు సర్వీస్ 'నమో భారత్'ను ప్రారంభించిన ప్రధాని
ఉత్తర్‌ప్రదేశ్ లో భారతదేశపు మొట్టమొదటి సెమీ-హై స్పీడ్ ప్రాంతీయ రైలు సర్వీస్ 'నమో భారత్'ను ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు జెండా ఊపి ప్రారంభించారు. సాహిబాబాద్,దుహై మధ్య 17కి.మీల ప్రాధాన్యత కలిగిన కారిడార్‌లో ర్యాపిడ్‌ఎక్స్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. దింతో భారతదేశంలో మొట్టమొదటి ప్రాంతీయ ర్యాపిడ్ రైలు సర్వీస్(RRTS)ప్రారంభం అయ్యింది. నమో భారత్ ఒక పరివర్తన ప్రాంతీయ అభివృద్ధి కార్యక్రమం,ఇది ఇంటర్‌సిటీ కమ్యూటింగ్ కోసం హై-స్పీడ్ రైళ్లను అందించడానికి రూపొందించబడిందని ప్రధాన మంత్రి కార్యాలయం (PMO) తెలిపింది. రైల్ సర్వీస్ పేరు RapidX నుండి NaMo Bharat గా మార్చబడింది.
ఢిల్లీ నుండి మీరట్‌కు ఒక గంట ప్రయాణం
సాహిబాబాద్,ఘజియాబాద్, గుల్దర్, దుహై, దుహై డిపో మీదుగా మొత్తం 5 స్టేషన్ మీదుగా ఈ రైలు ప్రయాణిస్తుంది. ప్రతి రైలులో 2×2 లే అవుట్‌లో సీట్లు, నిల్చునేందుకు విశాలమైన ప్రదేశం, లగేజ్ ర్యాక్‌లు, సీసీటీవీ కెమెరాలతో పాటు అత్యవసరమైన డోర్ ఓపెనింగ్ మెకానిజం, మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు, డైనమిక్ రూట్ మ్యాప్‌లు, ఆటో కంట్రోల్ యాంబియంట్ లైటింగ్ సిస్టమ్, హీటింగ్ వెంటిలేషన్, ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ తదితర సౌకర్యాలు ఉన్నాయి. ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ కారిడార్ ₹ 30,000 కోట్ల కంటే ఎక్కువ వ్యయంతో అభివృద్ధి చేయబడింది. ఘజియాబాద్, మురాద్‌నగర్,మోదీనగర్ పట్టణ కేంద్రాల ద్వారా ఢిల్లీ నుండి మీరట్‌కు ఒక గంట కంటే తక్కువ సమయంలో ప్రయాణించవచ్చని PMO తెలిపింది.