ఐఐటీ బాంబేకి నందన్ నీలేకని రూ.315 కోట్ల విరాళం
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని ఐఐటీ బాంబేకి రూ.315 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఐఐటీ బాంబేతో తన అనుబంధానికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ విరాళాన్ని ప్రకటించారు. 1973లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ కోసం ఐఐటీ బాంబేలో నందన్ నీలేకని చేరారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను పెంపొందించడానికి, ఇంజినీరింగ్, సాంకేతిక పరిజ్ఞానం యొక్క అభివృద్ధి చెందుతున్న రంగాలలో పరిశోధనలను ప్రోత్సహించడానికి ఆయన ఈ విరాళాన్ని అందజేశారు. ఇది భారతదేశంలో పూర్వ విద్యార్థి చేసిన అతిపెద్ద విరాళాలలో ఒకటిగా నిలిచిపోయినట్లు వార్తా నివేదికలు చెబుతున్నాయి.
ఐఐటీ బాంబే నాకు ఎంతో ఇచ్చింది: నందన్
ఐఐటీ బాంబే తన జీవితంలో ఒక మూలస్తంభంగా ఉందని, తన ప్రయాణానికి పునాది పడింది అక్కడేనని నందన్ నీలేకని చెప్పుకొచ్చారు. ఈ విరాళం ఆర్థిక సహకారం కంటే ఎక్కువ అన్నారు. ఐఐటీ బాంబే తనకు ఎంతో ఇచ్చిందని, దానికి కృతజ్ఞతా భావంతోనే ఈ విరాళం ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ అవగాహనా ఒప్పందంపై నీలేకని, ఐఐటీ బాంబే డైరెక్టర్ ప్రొఫెసర్ సుభాసిస్ చౌధురి మంగళవారం బెంగళూరులో సంతకాలు చేశారు. ఈ చారిత్రాత్మక విరాళం ఐఐటీ బాంబేని ప్రపంచ నాయకత్వ మార్గంలో నడిపిస్తుంది అని చౌదరి ఆశాభావం వ్యక్తం చేశారు. నీలేకని ఇంతకు ముందు ఐఐటీ బాంబేకి రూ.85 కోట్లు విరాళం ఇచ్చారు. దీంతో అతని మొత్తం విరాళం రూ.400 కోట్లకు చేరుకుంది.