Nara Lokesh : వైసీపీ శ్రేణులపై నారా లోకేష్ సీరియస్.. ఫ్యాక్షనిస్టుల కంటే ఘోరంగా దాడులు చేస్తున్నారని మండిపాటు
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోసారి వైసీపీ పార్టీ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు అధికారంలో ఉన్న పార్టీ నాయకులే ఫ్యాక్షనిస్టుల కంటే దారుణంగా దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత అరాచకం జరుగుతున్నా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని నారా లోకేష్ ఆవేదన వెలిబుచ్చారు. అధికారం ఉందని కొందరు వైసీపీ నాయకులు సైకోల్లా ప్రవర్తిస్తున్నారని నారా లోకేష్ మండిపడ్డారు. తాజాగా నంద్యాల జిల్లా కొలిమిగండ్లలో తెలుగు యువత అధికార ప్రతినిధి మంద విజయ్ గోపాల్ పై జరిగిన దాడిని లోకేష్ ఖండించారు. ఈ మేరకు ఏపీలో అరాచకం సృష్టిస్తున్న వారిపై, తమ పార్టీ క్యాడర్ పై దాడిచేస్తున్న ఎవ్వరినీ వదిలిపెట్టేది లేదని లోకేష్ హెచ్చరించారు.
ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు : లోకేశ్
తెలుగు యువత నాయకుడు విజయ్ గోపాల్ ను వైసీపీ సైకోలు చెప్పులతో కొట్టి అవమానించారని, అవే చెప్పులతో ప్రజలే వైసీపీని తరిమితరిమి కొట్టే రోజులు వస్తున్నాయన్నారు. రాజకీయ కక్షసాధింపులో భాగంగా అధికార పార్టీ నేతలు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారని లోకేష్ అన్నారు. ప్రతిపక్ష టీడీపీ నాయకులపై వైసీపీ నాయకులు వరుసగా దాడులు చేస్తుంటే శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులు ఏం చేస్తున్నారని లోకేష్ ప్రశ్నించారు. దాడులకు గురైన బాధితులపైనే రివర్స్ కేసులు బనాయించడం సిగ్గుచేటన్నారు. పోలీసులు తీరు ప్రభుత్వ ఉద్యోగుల్లా కాకుండా వైఎస్సాఆర్ సీపీ నాయకుల్లా ఉందని మండిపడ్డారు.
టీడీపీ అధ్యక్షుడు మునిరత్నం నాయుడిపై దాడిని ఖండించిన లోకేశ్
ఇటీవలే తిరుపతి జిల్లా చంద్రగిరిలోని భీమవరం గ్రామ టీడీపీ అధ్యక్షుడు మునిరత్నం నాయుడిపై స్థానిక వైసీపీ నేత కొటాల చంద్రశేఖర్ రెడ్డి అనుచరులతో కలిసి రాళ్లదాడి చేశాడు. ఘటనలో మునిరత్నం తీవ్ర గాయాల పాలై కిందపడిపోయారు. దీంతో అతడి చేతికున్న ఉంగరాలు, కడియంతో పాటు జేబులోని పదివేల రూపాయలను చంద్రశేఖర్ రెడ్డి అనుచరులు దోచుకెళ్లారని సమాచారం. వైసీపీ ఫ్యాక్షన్ పాలనలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, చికిత్స పొందుతున్న మునిరత్నం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంపై లోకేశ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు బాధితుడు త్వరగా కోలకోవాలని, పార్టీ అండగా ఉంటందని లోకేశ్ ధైర్యం చెప్పారు.