ప్రధాని మోదీ తండ్రి పేరును అపహాస్యం చేస్తే దేశం క్షమించదు: హిమంత శర్మ
అదానీ-హిండెన్‌బర్గ్ వివాదానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ పేరు, ఆయన తండ్రి పేరును కాంగ్రెస్ నాయకులు అపహాస్యం చేస్తున్నారని అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌సభ్యుల భయంకరమైన వ్యాఖ్యలను దేశం క్షమించదని శర్మ పేర్కొన్నారు. ఫిబ్రవరి 17న ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా విలేకరుల సమావేశంలో ప్రధాని తండ్రి పేరును తప్పుగా ఉచ్చరించినట్లు బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, వాజ్‌పేయి జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)ని ఎప్పుడు ఏర్పాటు చేస్తారో 'నరేంద్ర గౌతమ్‌దాస్..సారీ 'నరేంద్ర దామోదరదాస్ మోదీ'చెప్పాలని డిమాండ్ చేశారు. దామోదరదాస్‌కు బదులు గౌతమ్‌దాస్ అని పలికి మోదీ తండ్రి పేరును పవన్ అపహాస్యం చేసినట్లు బీజేపీ నాయకులు మండిపడుతున్నారు.
అధిష్ఠానం ఆశీస్సులతోనే పవన్ ఖేరా ఈ వ్యాఖ్యలు చేశారు: హిమంత బిస్వా శర్మ
కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా చేసిన వ్యాఖ్యలు తన అధిష్ఠానం ఆశీస్సులతో చేసినట్లు హిమంత బిస్వా శర్మ మండిపడుతున్నారు. ప్రధానిపై చేసిన వ్యాఖ్యలను దేశం క్షమించదని ట్వీట్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తండ్రిని కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా ఉద్దేశపూర్వకంగా ఎగతాళి చేశారని బీజేపీ నాయకుడు ముఖేష్ శర్మ ఉత్తర్ ప్రదేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతకుముందే ఇదే విషయంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు ఉపయోగించే భాషకు ప్రజలు బ్యాలెట్ బాక్స్ ద్వారా సమాధానం చెబుతారని అన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బైనాక్యులర్‌తో వెతికినా కాంగ్రెస్ కనిపించదని జోస్యం చెప్పారు.