Loading...
Rishabh Singh Sambyal: 12 ఏళ్ల ఆర్మీ సేవలకు గుడ్‌బై.. 'నేషనల్ క్రష్' మేజర్ రిషబ్ సంచలన నిర్ణయం
12 ఏళ్ల ఆర్మీ సేవలకు గుడ్‌బై.. 'నేషనల్ క్రష్' మేజర్ రిషబ్ సంచలన నిర్ణయం

Rishabh Singh Sambyal: 12 ఏళ్ల ఆర్మీ సేవలకు గుడ్‌బై.. 'నేషనల్ క్రష్' మేజర్ రిషబ్ సంచలన నిర్ణయం

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 31, 2026
12:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇంటర్నెట్‌లో విశేషమైన క్రేజ్ సంపాదించుకున్న, 'నేషనల్ క్రష్'గా అభిమానులు పిలుచుకునే మేజర్ రిషబ్ సింగ్ సంబ్యాల్ (Major Rishabh Singh Sambyal) భారత సైన్యానికి ముందస్తు పదవీ విరమణ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్ద సహాయకుడిగా (ADC) పనిచేసిన సమయంలో ఆయన పలు అధికారిక కార్యక్రమాలు,దౌత్యపరమైన సమావేశాలు,జాతీయ వేడుకల్లో రాష్ట్రపతితో కలిసి కనిపించేవారు. ఆయన గంభీరమైన రూపం,క్రమశిక్షణ నెటిజన్లను ఆకట్టుకున్నాయి. దీంతో ఆయనకు సంబంధించిన వీడియోలను అభిమానులు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తూ,వివిధ రకాల ఎడిట్లు రూపొందించారు. ఈ క్రమంలోనే ఆయనకు'నేషనల్ క్రష్' అనే పేరు వచ్చింది. ఇంతటి గుర్తింపు పొందిన మేజర్ రిషబ్ సింగ్ సంబ్యాల్ సైన్యాన్ని ఎందుకు వీడారన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

వివరాలు 

12 ఏళ్ల సేవల తర్వాత వీడ్కోలు

సుమారు 12 ఏళ్ల పాటు భారత సైన్యంలో సేవలందించిన తర్వాత వ్యక్తిగత, కుటుంబ కారణాలతోనే ముందస్తు పదవీ విరమణ (Premature Retirement) తీసుకున్నట్లు మేజర్ రిషబ్ సింగ్ సంబ్యాల్ వెల్లడించారు.

ఇది పూర్తిగా తన వ్యక్తిగత నిర్ణయమని స్పష్టం చేశారు. చిన్నతనం నుంచే ఆర్మీ యూనిఫాం ధరించడం తన కల అని చెప్పారు.

అయితే ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని అనూహ్య పరిస్థితులు ఎదురై.. జీవిత ప్రయాణాన్ని మరో దిశగా మళ్లిస్తాయని పేర్కొన్నారు.

సైన్యంలో కొనసాగిన సమయంలో తనకు ఎలాంటి వృత్తిపరమైన అసంతృప్తి లేదని కూడా ఆయన స్పష్టం చేశారు.

వివరాలు 

త్వరలో పెళ్లి చేసుకోనున్నారా?

మేజర్ రిషబ్ త్వరలో వివాహం చేసుకోబోతున్నారంటూ వచ్చిన వార్తలపై కూడా స్పందించారు.

ప్రస్తుతం తనకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదని స్పష్టం చేస్తూ ఆ వార్తలను ఖండించారు.

సైన్యాన్ని వీడినప్పటికీ మరో రూపంలో దేశానికి సేవ చేయడం కొనసాగిస్తానని చెప్పారు. తన భవిష్యత్ ప్రణాళికలను త్వరలోనే వెల్లడిస్తానని తెలిపారు.

ADVERTISEMENT

వివరాలు 

ఎవరీ మేజర్ రిషబ్ సింగ్ సంబ్యాల్?

రాష్ట్రపతి భవన్ అధికారిక డిజిటల్ ఫొటో లైబ్రరీలో మేజర్ రిషబ్ సింగ్ సంబ్యాల్‌ను పదవీవిరమణ చేసిన మాజీ ఏడీసీగా పేర్కొనడంతో ఆయన రిటైర్మెంట్ విషయం అధికారికంగా వెలుగులోకి వచ్చింది.

దీంతో మరోసారి ఆయన పేరు వార్తల్లో నిలిచింది.సైనిక కుటుంబంలో పెరిగిన రిషబ్ సింగ్ సంబ్యాల్.. జమ్మూ-కశ్మీర్‌కు చెందిన డోగ్రా రాజ్‌పుత్ కుటుంబ నేపథ్యాన్ని కలిగి ఉన్నారు.

2023 మార్చిలో భారత సాయుధ దళాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన,కీలకమైన బాధ్యతల్లో ఒకటైన రాష్ట్రపతి ఏడీసీ పదవికి ఆయన ఎంపికయ్యారు.

లెఫ్టినెంట్,కెప్టెన్,మేజర్ హోదాల్లో పనిచేస్తూ,ఎయిడ్-డి-క్యాంప్ బాధ్యతలు కూడా నిర్వర్తించారు.

నేషనల్ డిఫెన్స్ అకాడమీలో మూడేళ్లు,ఇండియన్ మిలిటరీ అకాడమీలో ఏడాది శిక్షణ అనంతరం సుమారు ఎనిమిదేళ్లు కమిషన్డ్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తించారు.

మొత్తంగా 12ఏళ్లపాటు భారత సైన్యానికి సేవలందించారు.

ADVERTISEMENT

వివరాలు 

2021లోనే గుర్తింపు

2021లో జాట్ రెజిమెంట్‌లో కెప్టెన్‌గా ఉన్న సమయంలో రిషబ్ సింగ్ సంబ్యాల్ తొలిసారిగా విస్తృతంగా గుర్తింపు పొందారు.

ఆ సమయంలో ఆయన నేతృత్వంలోని బృందం 'బెస్ట్ మార్చింగ్ కంటింజెంట్' ట్రోఫీని గెలుచుకుంది.

ఆ తర్వాత అత్యంత కఠినమైన సైనిక విభాగాల్లో ఒకటిగా పేరున్న 4 పారా (స్పెషల్ ఫోర్సెస్)లో సేవలందించారు.

అక్కడ విధులు నిర్వహించి 'బలిదాన్ బ్యాడ్జ్'ను పొందడం ఆయన సైనిక సామర్థ్యానికి, సేవలకు నిదర్శనంగా నిలిచింది.

వివరాలు 

రిటైర్మెంట్ తర్వాత రాష్ట్రపతితో భేటీ

అధికారికంగా పదవీ విరమణ చేసిన అనంతరం ఈ నెల 21న అంటే 2026 ఆగస్టు 21న మేజర్ రిషబ్ సింగ్ సంబ్యాల్ రాష్ట్రపతి భవన్‌లో ద్రౌపది ముర్మును కలిశారు.

ఈ భేటీకి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

రాష్ట్రపతి మార్గదర్శకత్వం, ఆశీర్వాదాలకు కృతజ్ఞతలు తెలిపే అవకాశంగా ఈ పర్యటనను ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొన్నారు.

వివరాలు 

విద్య.. సైనిక ప్రస్థానం

2013లో నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA) ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన రిషబ్ సింగ్ సంబ్యాల్.. 2014లో 133వ NDA కోర్సులో చేరారు.

2017లో అంతర్జాతీయ సంబంధాలు, వ్యవహారాల్లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ పూర్తి చేశారు.

అదే ఏడాది ఇండియన్ మిలిటరీ అకాడమీలో చేరి మిలిటరీ స్టడీస్, డిఫెన్స్ మేనేజ్‌మెంట్‌లో శిక్షణ పొందారు.

ప్రతిభావంతుడైన అధికారి సైన్యానికి దూరం కావడం కొంతమంది అభిమానులకు విచారం కలిగించినప్పటికీ.. దేశానికి ఆయన అందించిన 12 ఏళ్ల సేవలను గుర్తు చేసుకుంటూ నెటిజన్లు అభినందనలు తెలియజేస్తున్నారు.

ADVERTISEMENT